Moong Dal Curry : మనం ఎక్కువగా పెసలను మొలకలుగా చేసి లేదా పెసలతో దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. పెసల వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు మనందరికీ తెలుసు. పెసలలో పోషకాలు అధికంగాఉంటాయి. శరీరంలో పేరుకు పోయిన కొవ్వును తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో పెసలు సహాయపడతాయి. వేసవి కాలంలో పెసలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల వడదెబ్బ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
వీటిల్లో ఉండే పొటాషియం, మెగ్నిపియం వంటి మినరల్స్ హైబీపీని తగ్గించడంలో సహాయపడతాయి. పెసలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అజీర్తి సమస్య నుండి బయట పడడమే కాకుండా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడంలో పెసలు సహాయపడతాయి. పెసలతో దోశలను, మొలకలను తయారు చేయడమే కాకుండా ఎంతో రుచిగా కూరను కూడా తయారు చేసుకోవచ్చు. పెసలతో కూరను ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాల గురించి.. ఇప్పుడు తెలుసుకుందాం.
పెసల కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసలు – ఒక కప్పు, టమాటాలు – 3 (పెద్దవి), పచ్చి మిర్చి – 4, తరిగిన ఉల్లిపాయ – ఒకటి, నూనె – రెండు టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, మినప పప్పు – అర టీ స్పూన్, ఎండు మిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, నీళ్లు – తగినన్ని, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – రుచికి సరిపడా, నెయ్యి – ఒక టీ స్పూన్.
పెసల కూర తయారీ విధానం..
ముందుగా పెసలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లను పోసుకుని ఒక గంట పాటు నానబెట్ఠుకోవాలి. తరువాత కుక్కర్ లో.. నానబెట్టుకున్న పెసలను తగినన్ని నీళ్లను పోసి ఒక్క విజిల్ వచ్చే వరకు మాత్రమే ఉడికించుకోవాలి. తరువాత ఒక జార్ లో పెద్దగా తరిగిన టమాటా ముక్కలను, రెండు పచ్చి మిరపకాయలను వేసి మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, మినప పప్పు, ఎండు మిర్చి, పచ్చి మిర్చి ముక్కలు, కరివేపాకును వేసి వేయించుకోవాలి.
ఉల్లిపాయ ముక్కలు 80 శాతం వరకు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తరువాత పసుపు, కారం, ధనియాల పొడి, కొద్దిగా నీటిని పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా, పచ్చి మిర్చి మిశ్రమం, రుచికి సరిపడా ఉప్పును వేసి కలుపుకోవాలి. టమాటా మిశ్రమం ఉడికిన తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసలను, గరం మసాలాను వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఒక గ్లాస్ నీటిని పోసి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
చివరగా తరిగిన కొత్తిమీర, నెయ్యిని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెసల కూర తయారవుతుంది. దీనిని చపాతీ, పుల్కా, బటర్ నాన్, దోశలతో పాటు అన్నంతో కూడా కలిపి తినవచ్చు. పెసలను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.