Pesara Guggillu : పెసలు.. ఇవి మనందరికీ తెలిసినవే. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చని కూడా మనకు తెలుసు. పెసలలో శరీరానికి కావల్సిన పోషకాలన్నీ ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ కె వంటి విటమిన్స్ తోపాటు అనేక రకాల మినరల్స్, ప్రోటీన్స్ పెసలలో ఉంటాయి. చర్మాన్ని, జుట్టును సంరక్షించడంలో పెసలు ఎంతగానో సహాయపడతాయి. బీపీని నియంత్రించడంలో, శరీరంలో ఉండే వ్యర్థాలను తొలగించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో, అధికంగా ఉన్న బరువును తగ్గించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. పెసలు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పెసరట్టు. అయితే పెసరట్టు కాకుండా పెసలతో ఎంతో రుచిగా ఉండే గుగ్గిళ్లను కూడా తయారు చేసుకోవచ్చు. పెసలతో గుగ్గిళ్లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెసర గుగ్గిళ్ల తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసలు – 200 గ్రా., నీళ్లు – తగినన్ని, ఉప్పు – తగినంత, నూనె – రెండున్నర టేబుల్ స్పూన్స్, శనగ పప్పు – అర టీ స్పూన్, మినప పప్పు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, ఎండు మిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన పచ్చి మిర్చి – 3, తరిగిన ఉల్లిపాయ – 1, పసుపు- చిటికెడు.
పెసర గుగ్గిళ్లను తయారు చేసే విధానం..
ముందుగా పెసలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లను పోసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పెసలను కుక్కర్ లో వేసి పెసలు మునిగే వరకు తగినన్ని నీళ్లను పోసి, ఇందులోనే రుచికి తగినంత, ఉప్పు, అర టేబుల్ స్పూన్ నూనెను వేసి కలిపి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి మూత తీసి జల్లి గిన్నె సహాయంతో పెసలలోని నీరు అంతా పోయేలా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి కాగిన తరువాత మిగిలిన పదార్తాలను ఒక్కొక్కటిగా వేసి తాళింపు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తాళింపు వేగిన తరువాత ముందుగా ఉంకించి పెట్టుకున్న పెసలను వేసి కలిపి మూత పెట్టి 4 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెసర గుగ్గిళ్లు తయారవుతాయి. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా వీటిని తీసుకోవడం వల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.