Raw Papaya Curry : సాధారణంగా చాలా మంది బొప్పాయి పండ్లను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే బొప్పాయి పండ్లే కాదు.. పచ్చి బొప్పాయి కాయలను కూడా తినవచ్చు. వీటిల్లోనూ అనేక పోషకాలు ఉంటాయి. ఇవి కూడా మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. అయితే పచ్చి బొప్పాయి కాయలను ఎలా తినాలా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. కానీ వీటిని నేరుగా తినలేకపోతే కూర రూపంలో వండి కూడా తినవచ్చు. ఇక పచ్చి బొప్పాయి కాయలతో కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి బొప్పాయి కాయ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి బొప్పాయి – అర కేజీ, ఉల్లిపాయ తరుగు – పావు కప్పు, టమాటా తరుగు – పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు – 4, సోంపు గింజలు – ఒక టీస్పూన్, మిరప కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒకటిన్నర టీ స్పూన్లు, పసుపు – పావు టీస్పూన్, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్.
పచ్చి బొప్పాయి కాయ కూర తయారు చేసే విధానం..
కుక్కర్‌లో నూనె వేసి వేడి చేయాలి. సోంపు వేసి చిట పట లాడించాలి. అల్లం, వెల్లుల్లి తురుము వేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి. ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాక టమాటా తరుగు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. మిగిలిన మసాలా వస్తువులన్నీ వేసి వేయించాలి. చివరగా బొప్పాయి ముక్కలు వేసి బాగా కలిపి ఒక కప్పు నీళ్లు జత చేసి మూత పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చాక దింపేసి కొత్తిమీర తరుగుతో అలంకరించి వడ్డించాలి. పుల్కా, రోటీ లేదా అన్నంతో ఈ కూరను తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
పచ్చి బొప్పాయి కాయలను నేరుగా తినలేరు కనుక ఇలా కూర రూపంలో వండి తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో ఉండే పోషకాలన్నీ మనకు లభిస్తాయి. పచ్చి బొప్పాయి కాయలను తినడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి జీర్ణశక్తిని పెంచుతాయి. మలబద్దకాన్ని తగ్గిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. ఇలా పచ్చి బొప్పాయి కాయలతో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.