Eggs : కండ పుష్ఠిగా, బలంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కండ పుష్ఠిగా, బలంగా ఉండడానికి తీసుకునే ఆహారాలల్లో గుడ్డు ఒకటి. గుడ్డును తినడం వల్ల కండ పుష్ఠిగా, బలంగా తయారవుతారని అందరికీ తెలుసు. శరీర ధారుడ్యం కోసం వ్యాయామాలు చేసే వారు, ఆటలు ఆడే వారు కోడి గుడ్లను అధికంగా తింటూ ఉంటారు. టీవీలలో, పేపర్లలో గుడ్డు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు అని చెప్పే ప్రకటనలను కూడా చూస్తూ ఉంటాం. గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదే, కానీ మనకు గుడ్లను ఇచ్చే కోళ్లు గింజలను తింటాయి. గింజల నుండి వచ్చిన బలంతోనే గుడ్డు తయారవుతుంది. కనుక గుడ్లను తినడం కంటే గింజలను నేరుగా లేదా మొలకెత్తించి తినడం వల్ల అధిక ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
గుడ్డు ద్వారా వచ్చే శక్తి కంటే గింజలను తినడం ద్వారా వచ్చే శక్తే అధికంగా ఉంటుంది.ఒక కోడి గుడ్డు సుమారుగా 50 గ్రా. నుండి 60 గ్రా. ల బరువు ఉంటుంది. ఒక కోడి గుడ్డులో సుమారుగా 72 క్యాలరీల శక్తి ఉంటుంది. ఇందులో 17 క్యాలరీల శక్తి తెల్లసొనలో ఉండగా మిగిలిన క్యాలరీల శక్తి పచ్చ సొనలో ఉంటుంది. మనలో కొంత మంది గుడ్డులో పచ్చ సొనను తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందనే కారణంతో పచ్చ సొనను పారేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మన శరీరానికి కేవలం 17 క్యాలరీల శక్తి మాత్రమే అందుతుంది.
కోడి గుడ్డులో 7 గ్రా. ల ప్రోటీన్ ఉంటుంది. గుడ్డు నుండి పచ్చ సొనను పారేయడం వల్ల 3 గ్రా. ల ప్రోటీన్ పోతుంది. దీంతో 4 గ్రా. ల ప్రోటీన్ మాత్రమే మన శరీరానికి అందుతుంది. ఎదిగే పిల్లలకు శరీర బరువులో ఒక కిలోకి 2 గ్రా.ల చొప్పున.. పెద్దలకు ఒక కిలోకి 1 గ్రా. చొప్పున ప్రోటీన్ మన శరీరానికి అవసరమవుతుంది. ఒక గుడ్డు అంత బరువు ఉండే పెసలను మొలకలుగా చేసి ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి 15 గ్రా. ల ప్రోటీన్, 210 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఈ పెసలను మొలకలుగా చేసి ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ప్రోటీన్ తోపాటుగా శక్తి లభిస్తుంది. 60 గ్రా. ల పెసలను తినడం ద్వారా లభించే శక్తి .. 4 లేదా 5 కోడి గుడ్లతో సమానం. మనం అన్ని గుడ్లను తినలేం. కనుక పెసలను తింటే అన్ని గుడ్లను తిన్న శక్తి లభిస్తుంది. పైగా చెడు కొలెస్ట్రాల్ పెరగదు. కనుక పెసలు ఆరోగ్యకరం అని చెప్పవచ్చు.
ఒక గుడ్డులో 220 మిల్లీ గ్రా.ల కొలెస్ట్రాల్ ఉంటుంది. పెసలలో కొలెస్ట్రాల్ ఉండదు.పెసలను తినడం వల్ల శరీరంలో మంచి కొవ్వు (హెచ్‌డీఎల్) స్థాయిలు పెరుగుతాయి. అలాగే కోడి గుడ్లలో ఫైబర్, కార్బొహైడ్రేట్స్ వంటి పోషకాలు ఉండవు. పెసలలో ఫైబర్, కార్బొహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. పెసలను తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.
అంతే కాకుండా ఒక గుడ్డు అంత బరువులో ఉండే వేరుశనగ గింజలను (పల్లీలు) తినడం వల్ల గుడ్డు కంటే ఐదు రెట్ల ఎక్కువ పోషకాలు మన శరీరానికి లభిస్తాయి. పిల్లలకు గుడ్డు కంటే మొలకెత్తిన గింజలు ఎక్కువ మేలు చేస్తాయి. కనుక కండ పుష్ఠికి, బలానికి గుడ్డును ఆహారంగా తీసుకోవడం కంటే గింజలను, మొలకెత్తిన గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల అధిక ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే కోడిగుడ్లను తినవద్దని చెప్పడం లేదు. కానీ అధిక శక్తి, ప్రోటీన్లు కావాలనుకుంటే గుడ్లకు బదులుగా పెసలు, పల్లీలను తినవచ్చు. గుడ్లు కూడా మనకు పౌష్టికాహారాన్నే అందిస్తాయి. కానీ అంతే మోతాదులో ఆయా గింజలను తినడం వల్ల గుడ్డు కన్నా ఎక్కువ పోషకాలు లభిస్తాయి. అదన్నమాట అసలు విషయం.. కనుక ఇకపై రెండింటిలో ఏవి తినాలి ? గింజలా.. కోడిగుడ్లా.. అంటే.. అది మీ చాయిస్.. మీకు నచ్చినట్లు తినవచ్చు..!