Sesame Seeds Peanuts Laddu : మనం ఇంట్లో పల్లీలతో, నువ్వులతో వేరు వేరుగా రకరకాలుగా లడ్డూలను తయారు చేస్తూ ఉంటాం. వీటితో చేసేలడ్డూలు చాలా రుచిగా ఉండడమే కాకుండా శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటితో విడివిడిగా కాకుండా ఈ రెండిటినీ కలిపి కూడా మనం లడ్డూలను తయారు చేయవచ్చు. ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయి. నువ్వులు, పల్లీలతో ఇలా లడ్డూలను చేసి తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. రక్త హీనత సమస్య తగ్గుతుంది. పిల్లలకు వీటిని ఆహారంగా ఇవ్వడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. పిల్లల ఎదుగుదలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
స్త్రీలు ఈ లడ్డూలను తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల నెలసరి క్రమం తప్పకుండా వస్తుంది. అలాగే పీసీవోడీ సమస్యలు తగ్గడంతోపాటు నెలసరి సమయంలో వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయి. ఇక పురుషులకు కూడా ఈ లడ్డూలు ఎంతగానో మేలు చేస్తాయి. వారిలో ఉండే సమస్యలు తగ్గుతాయి. ఇక నువ్వులు, పల్లీల లడ్డూలను చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. వీటిని ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నువ్వులు పల్లీల లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
నువ్వులు – ఒక కప్పు, పల్లీలు – ఒక కప్పు, బెల్లం తురుము – ఒక కప్పు, నెయ్యి – కొద్దిగా.
నువ్వులు పల్లీల లడ్డూ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో పల్లీలను వేసి మధ్యస్థ మంటపై బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీలను ఒక ప్లేట్ లో వేసి చల్లారే వరకు పక్కన పెట్టటుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నువ్వులను వేసి రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా పల్లీలను ఉంచిన ప్లేట్ లోకి తీసుకుని చల్లగా అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తరువాత ఒక జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే బెల్లం తురుమును వేసి మరో సారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని చేతులకు నెయ్యి రాసుకుంటూ కావల్సిన పరిమాణంలో లడ్డూలలా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నువ్వులు పల్లీల లడ్డూలు తయారవుతాయి. ఇవి పది రోజుల వరకు నిల్వ ఉంటాయి. వీటిని ప్రతి రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.