Upavasam : ఉపవాసం.. మనకు పూర్వకాలం నుండి వస్తున్న అనేక ఆచారాల్లో ఇది ఒకటి. మన ఇష్ట దైవానికి అనుగుణమైన రోజున మనం ఉపవాసం చేస్తూ ఉంటాం. ఉపవాసానికి అర్థం కూడా ఉంది. ఉప అనగా సమీపంలో, వాసం అనగా ఉండడం అని అర్థం. అనగా మన ఇష్టదైవానికి దగ్గరలో ఉండి ప్రశాంతమైన మనస్సుతో ఆరాధించడం అని అర్థం. ఉపవాసం ఏ ఒక్కరికీకి సొంతమైనది కాదు. శరీరాన్ని, ఆత్మను పరిశుభ్రపరిచే ప్రక్రియే ఉపవాసం. ఉపవాసం చేయడం వెనుక కూడా ఎన్నో ఆరోగ్యకరమైన రహస్యాలు దాగి ఉన్నాయి. అసలు ఉపవాసం ఎందుకు చేయాలి.. ఉపవాసాన్ని ఎలా చేయాలి.. తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉపవాసాన్ని అనేక రకాలుగా చేస్తారు. కొందరు ఒకపూట చేస్తే మరికొందరు పగలు, రాత్రి లేదా ఒక రోజంతా చేస్తారు. మంచి నీళ్లు కూడా తాగకుండా చేసే ఉపవాసాన్ని కటిక ఉపవాసం అంటారు. లంఖణం పరమౌషధమని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఉపవాసం ఉండడం వల్ల మన శరీరంలో ఉండే వ్యర్థాలు తొలగిపోతాయి. జీవక్రియ మెరుగుపడుతుంది. అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. ఉపవాసం ఉండడం వల్ల శరీరంలో గ్లూకోజ్ నిరోధకత తగ్గి మధుమేహం బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
ఒక పద్దతి ప్రకారం కొన్ని గంటల పాటు ఆహారాన్ని తీసుకోకుండా ఉండడం వల్ల శరీరంలో ఎన్నో మంచి మార్పులు సంభవిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా మంది మూఢ నమ్మకాలతో ఒంట్లో బాగాలేక పోయినా ఉపవాసం చేసి ఆరోగ్య సమస్యలను కొన్ని తెచ్చుకుంటున్నారు. ఈ నియమాలన్నీ మనం పెట్టుకున్నవి మాత్రమే. మన శరీరాన్ని కష్ట పెట్టకుండా తగిన రీతిలో ఉపవాసం చేయాలి. మనం ఉపవాసం చేయలేము అన్నప్పుడు మాత్రమే తేలిక పాటి ఆహారాలైన పండ్లను, నీళ్లను తీసుకోవాలి.
మొదటిసారి ఉపవాసం చేసినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఒక క్రమ పద్దతిలో చేస్తూ ఉండడం వల్ల శరీరం కూడా అలవాటు పడిపోతుంది. ఉపవాసం చేసేటప్పుడు ఆకలి మీద దృష్టి మళ్లకుండా చూసుకోవాలి. ఉపవాసం విడిచిన వెంటనే ఏది పడితే అది తినకూడదు. పండ్లు, కూరగాయాల వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. ఉపవాసం చేసే రోజున శరీరం అలసిపోయేలా పనులు చేయకుండా తేలికపాటి పనులు చేయాలి. చిన్న పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, షుగర్ వ్యాధి గ్రస్తులు ఉపవాసానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధంగా ఉపవాసం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.