Gas Trouble : సాధారణంగా గ్యాస్ సమస్య అనేది ప్రతి ఒక్కరికీ వస్తూనే ఉంటుంది. అయితే తీవ్రమైన గ్యాస్ సమస్య అనేది కొందరిని ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. గ్యాస్ ఏర్పడడం అనేది సహజమే. అయితే తీవ్రమైన గ్యాస్ ఏర్పడితేనే అసౌకర్యంగా ఉంటుంది. ఇబ్బందిగా అనిపిస్తుంది. సరైన డైట్ పాటించకపోవడం, వేళకు భోజనం చేయకపోవడం, అతిగా తినడం, జంక్ ఫుడ్ తినడం.. వంటి కారణాల వల్ల గ్యాస్ సమస్య వస్తుంటుంది. దీంతో కొందరికి విపరీతమైన గ్యాస్ చేరుతుంది.
అయితే ఆయుర్వేదం ప్రకారం.. గ్యాస్ సమస్యతోపాటు ఇతర జీర్ణ సమస్యల నుంచి సులభంగా బయట పడవచ్చు. ముందుగా పౌష్టికాహారాన్ని వేళకు తీసుకోవడం మొదలు పెట్టాలి. జంక్ ఫుడ్ మానేయాలి. ఇలా చేస్తే సగం సమస్య తగ్గిపోతుంది. ఇక కింద తెలిపిన మూలికలను తీసుకోవడం వల్ల తీవ్రమైన గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ మూలికలు ఏమిటంటే..
1. గ్యాస్ సమస్య నుంచి బయట పడేసేందుకు గడ్డి చామంతి బాగా పనిచేస్తుంది. వీటి పూలతో తయారు చేసిన టీని తాగుతుంటే గ్యాస్ నుంచి విముక్తి లభిస్తుంది. మార్కెట్‌లో మనకు ఈ టీ లభిస్తుంది. వీటి ఎండిన పువ్వులను విక్రయిస్తారు. వాటితో టీ తయారు చేసుకుని తాగవచ్చు. రోజుకు 2 కప్పుల టీ తాగుతుంటే గ్యాస్ సమస్య తగ్గుతుంది.
2. కొత్తిమీర ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు. ఈ ఆకుల రసాన్ని ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు 1 టీస్పూన్ మోతాదులో తీసుకోవాలి. దీంతో జీర్ణాశయ గోడలు ప్రశాంతంగా మారుతాయి. గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా ఉంటుంది. గ్యాస్ సమస్య తగ్గుతుంది.
3. భోజనం చేసిన వెంటనే సోంపు గింజలను నోట్లో వేసుకుని నమిలి మింగడం వల్ల కూడా గ్యాస్ సమస్య తగ్గుతుంది. దీంతోపాటు ఇతర జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
4. రోజూ ఉదయాన్నే పరగడుపునే 1 టీస్పూన్ తులసి ఆకుల రసాన్ని తాగుతుండాలి. దీని వల్ల గ్యాస్, జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
5. ఒక టీస్పూన్ జీలకర్రను తీసుకుని కప్పు నీటిలో వేసి మరిగించి డికాషన్‌లా చేసి ఉదయం, సాయంత్రం తాగుతుండాలి. గ్యాస్ తగ్గిపోతుంది.
6. పుదీనా ఆకుల రసాన్ని కూడా రోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు 1 టీస్పూన్ మోతాదులో తాగుతుండాలి. లేదా పుదీనా ఆకులతో చేసిన చట్నీని తినవచ్చు. దీంతో గ్యాస్, జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి.