Karakkaya : మనకు వచ్చే అనేక రోగాలను నయం చేయడంలో ఉపయోగించే త్రిఫల చూర్ణం గురించి మనందరికీ తెలుసు. త్రిఫల చూర్ణం తయారీలో ఉపయోగించే వాటిల్లో కరక్కాయ ఒకటి. కరక్కాయ మనకు తల్లి వంటిదని ఆయుర్వేద నిపుణులు అంటుంటారు. దీనిని ఉపయోగించడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు, పెద్దలకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను కరక్కాయను ఉపయోగించి నయం చేసుకోవచ్చు. కరక్కాయ వగరు, తీపి, చేదు రుచులను కలిగి శరీరానికి చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది.
మనకు వచ్చే త్రిదోషాలను నయం చేయడంలో కరక్కాయ ఎంతో సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలు మాత్రం కరక్కాయను ఉపయోగించరాదు. కరక్కాయను ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కరక్కాయ బెరడు పొడి 20 గ్రా., ధనియాల పొడి 50 గ్రా., పటిక బెల్లం పొడి 70 గ్రా., ల మోతాదులో తీసుకుని వీటన్నింటినీ కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోజూ రాత్రి భోజనం తరువాత ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ మంచి నీటిలో కలుపుకుని తాగాలి. ఇలా తాగడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. అంతేకాకుండా మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. ఈ పొడిని రాత్రిపూట తీసుకోవడం వల్ల మలబద్దకం తగ్గి ఉదయం సుఖ విరేచనం అవుతుంది.
రక్త మొలలతో బాధపడే వారు కరక్కాయ పొడిని 5 గ్రాముల మోతాదులో తీసుకుని దానికి 5 గ్రాముల పాత బెల్లాన్ని కలిపి రోజూ భోజనానికి గంట ముందు తింటూ ఉంటే రక్త మొలల సమస్య నయం అవుతుంది. కరక్కాయ బెరడు పొడి 60 గ్రాములు, పిప్పళ్ల పొడి 30 గ్రాములు, దాల్చిన చెక్క పొడి 10 గ్రాములు, నల్ల ఉప్పు 10 గ్రాములు, పొంగించిన ఇంగువ పొడి 5 గ్రాముల మోతదులో తీసుకుని వీటన్నింటనీ కలిని నిల్వ చేసుకోవాలి. పూటకు రెండు లేదా మూడు గ్రాముల మోతాదులో ఒక గ్లాస్ వేడి నీటిలో కలిపి భోజనానికి అర గంట ముందు తీసుకుంటూ ఉంటే ఆకలి పెరగడమే కాకుండా తిన్న భోజనం కూడా త్వరగా జీర్ణమవుతుంది.
అధిక చెమటతో బాధపడే వారు కరక్కాయ బెరడును మంచి నీటితో నూరి ఆ మిశ్రమాన్ని శరీరానికి నలుగు పెట్టుకుని ఆరిన తరువాత స్నానం చేస్తూ ఉండడం వల్ల అధిక చెమట సమస్య తగ్గుతుంది. వాంతులతో బాధపడే వారు కారక్కాయ పొడిని 3 గ్రాముల మోతాదులో తీసుకుని దానికి ఒక టీ స్పూన్ తేనెను కలిపి రోజుకు రెండు లేదా మూడు సార్లు సేవిస్తూ ఉంటే వాంతులు తగ్గుతాయి. అర కప్పు గోమూత్రంలో 5 గ్రాముల కరక్కాయ పొడిని కలుపుకుని తాగడం వల్ల చర్మంపై వచ్చే దురదలు, దద్దుర్లు తగ్గుతాయి. ఈ విధంగా కరక్కాయ మనకు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.