Teeth Problems : మనల్ని వేధించే అనారోగ్య సమస్యల్లో దంతాల సమస్య కూడా ఒకటి. దంతాలు, చిగుళ్ల సమస్యలతో బాధపడే వారు రోజురోజుకూ ఎక్కువవుతున్నారు. దంతాల నొప్పి, దంతాలు పుచ్చి పోవడం, దంతాలు కదలడం, చిగుళ్ల నుండి రక్తం కారడం, చిగుళ్ల వాపు వంటి వాటిని మనం దంతాల, చిగుళ్ల సమస్యలుగా చెప్పవచ్చు. ఈ సమస్యలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. శరీరంలో పోషకాహార లోపం, దంతాలను గట్టిగా ఉండే బ్రష్ తో శుభ్రం చేసుకోవడం, మనం తినే ఆహారంతోపాటు ఇతరత్రా కారణాల వల్ల కూడా మనం ఈ సమస్యల బారిన పడే అవకాశాలు ఉంటాయి.
కొన్నిసార్లు వైరస్, బాక్టీరియాల వల్ల కలిగే ఇన్ ఫెక్షన్ ల కారణంగా కూడా చిగుళ్ల వాపు సమస్య తలెత్తుంది. దంతాలు, చిగుళ్ల సమస్య నుండి బయటపడడానికి మనం అనేక రకాల టూత్ పేస్ట్ లను ఉపయోగిస్తూ ఉంటాం. దంతాల నొప్పుల నుండి బయటపడడానికి యాంటీ బయాటిక్స్ మందులను, ఆయింట్ మెంట్లను వాడడం వంటి వాటిని చేస్తూ ఉంటాం. ఆయుర్వేదం ద్వారా కొన్ని రకాల చిట్కాలను పాటించి మనం దంతాల, చిగుళ్ల సమస్యలన్నింటి నుండి బయటపడవచ్చు. దంతాల, చిగుళ్ల సమస్యలన్నింటినీ ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందుకోసం మనం నల్ల తుమ్మ చెట్టు బెరడును, పటిక బెల్లం పొడిని ఉపయోగించాల్సి ఉంటుంది. నల్ల తుమ్మ చెట్టు బెరడును నీటిలో వేసి మరిగించాలి. ఈ కషాయానికి పటిక బెల్లం పొడిని కలిపి నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా రోజుకు రెండు నుండి మూడు సార్లు చేస్తూ ఉండడం వల్ల చిగుళ్ల నుండి రక్తం, చీము కారడం, చిగుళ్ల వాపు, నొప్పి తగ్గడంతోపాటు కదిలే దంతాలు కూడా గట్టిపడతాయి. అలాగే నేరేడు చెట్టు ఆకుల రసాన్ని నోట్లో పోసుకుని పుక్కిలిస్తూ ఉండడం వల్ల కూడా చిగుళ్ల వాపు తగ్గి చిగుళ్లు గట్టిపడతాయి. దంతాల నొప్పులు కూడా తగ్గుతాయి. దంతాలు పుచ్చిపోకుండా ఉంటాయి.
అదే విధంగా ఈ సమస్యల నుండి బయటపడడానికి మనకు మామిడి ఆకులు కూడా ఉపయోగపడతాయి. మామిడి ఆకులను దంచి నీటిలో వేసి కషాయాన్ని చేసుకోవాలి. ఈ కషాయాన్ని నోట్లో పోసుకుని రోజుకు రెండు నుండి మూడు సార్లు పుక్కిలిస్తూ ఉండడం వల్ల కూడా చిగుళ్ల సమస్యలన్నీ తగ్గుతాయి. అంతేకాకుండా నోటిపూత, నోట్లో పుండ్లు వంటివి కూడా తగ్గుతాయి. ఈ చిట్కాలను పాటించడం వల్ల మనం దంతాల, చిగుళ్ల సమస్యలన్నింటి నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.