Ayurvedic Treatment for Dengue Fever : డెంగ్యూ అనేది దోమకాటుతో వచ్చే వ్యాధి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆడ ఏడిస్ దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ దోమలు ఎక్కువగా మనల్ని పగటిపూటే కుడతాయి. అందువల్ల ఈ సీజన్‌లో దోమల నుంచి సురక్షితంగా ఉండాలి. అప్పుడు డెంగ్యూ లేదా మలేరియా వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. అయితే డెంగ్యూ వచ్చిన వారిలో పలు లక్షణాలు కనిపిస్తాయి. ఫ్లూ జ్వరంలా అనిపిస్తుంది. అలాగే ట్రీట్‌మెంట్ ఆలస్యం చేస్తే ప్రాణాంతకం కూడా అయ్యే ప్రమాదం ఉంటుంది. కనుక డెంగ్యూ వచ్చిన వారు లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
డెంగ్యూ వచ్చిన వారిలో వికారం, తలనొప్పి, తలతిరగడం, వాంతికి వచ్చినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే జ్వరం కూడా ఉంటుంది. ఈ జ్వరం సుమారుగా దోమ కుట్టిన తరువాత 3 లేదా 4వ రోజు నుంచి మొదలవుతుంది. కొందరికి వెంటనే కూడా జ్వరం రావచ్చు. ఈ జ్వరం సుమారుగా 7 నుంచి 10 రోజుల వరకు ఉంటుంది. కనుక ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలిసి డెంగ్యూ పరీక్షలు చేయించుకుని, వ్యాధి ఉందని తేలితే వెంటనే చికిత్స తీసుకోవాలి.
ఇక డెంగ్యూ వచ్చిన వారు బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వల్ల త్వరగా కోలుకుంటారని ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ చైతలి రాథోర్ చెప్పారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ఆమె చెప్పిన ప్రకారం బొప్పాయి ఆకులు డెంగ్యూ జ్వరాన్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఆకుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేద పరంగా డెంగ్యూకు బొప్పాయి ఆకులు గొప్ప ఔషధంగా పనిచేస్తాయి. కనుక ఈ ఆకుల నుంచి జ్యూస్ తయారు చేసి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
బొప్నాయి ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు ఎలాంటి జ్వరాన్నయినా సరే తగ్గిస్తాయి. వీటిల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు సైతం ఉంటాయి. అందువల్ల శరీరంలోని నొప్పులు సైతం తగ్గుతాయి. బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దగ్గు, జలుబు, ఆస్తమా, శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. లివర్ పెరగడం, జీర్ణక్రియ మందగించడం, శరీరంలో వాపులు వంటి వ్యాధులు ఉన్నవారు కూడా బొప్పాయి ఆకుల రసాన్ని రోజూ తాగాలి. ఇక ఈ ఆకులను కొన్ని తీసుకుని శుభ్రంగా కడిగి వాటి నుంచి రసం తీయాలి. ఆ రసాన్ని పెద్దలు అయితే రోజుకు 10 నుంచి 15 ఎంఎల్ మోతాదులో, పిల్లలు అయితే రోజుకు 5 ఎంఎల్ మోతాదులో తాగాలి.
బొప్పాయి ఆకుల రసాన్ని మోతాదులో మాత్రమే తాగాల్సి ఉంటుంది. మరీ ఎక్కువగా తాగితే వాంతులు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే కొందరికి విరేచనాలు కూడా అవచ్చు. కనుక ఈ ఆకుల రసాన్ని మోతాదులో మాత్రమే సేవించాలి. ఇలా బొప్పాయి ఆకుల రసం తాగడంతోపాటు ఆహారంలోనూ కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే డెంగ్యూ నుంచి త్వరగా కోలుకుంటారు. ముఖ్యంగా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి. చక్కెర, తీపి లేదా నూనె పదార్థాలు, జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, చాక్లెట్స్, బిస్కెట్లు, వేపుళ్లు, మాంసం వంటి ఆహారాలను తినకూడదు. అలాగే రాత్రిపూట ఎక్కువ సేపు మేల్కొని ఉండకూడదు. ఎంత బాగా విశ్రాంతి తీసుకుంటే అంత త్వరగా డెంగ్యూ నుంచి కోలుకుంటారు. కనుక ఈ చిట్కాలను పాటిస్తే డెంగ్యూ నుంచి సురక్షితంగా బయట పడవచ్చు.