Bad Breath : నోరు తాజాగాఉండాలని అలాగే నోరు దుర్వాసన రాకుండా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. దీనికోసం భోజనం చేయడానికి ముందు అలాగే భోజనం చేసిన తరువాత రసాయనాలు కలిగిన మౌత్ వాష్ లతో నోటిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు. వీటిని నోట్లో పోసుకుని ఒక నిమిషం పాటు పుక్కిలించి ఉమ్మివేస్తూ ఉంటారు. వీటిని ఉమ్మి వేస్తున్నాం కదా వీటి వల్ల మన శరీరానికి ఎటువంటి హాని కలగదు కేవలం మేలే కలుగుతుందనే చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ ఈ కెమికల్ మౌత్ వాష్ ల వల్ల కూడా మనం వివిధ రకాల ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ మౌత్ వాష్ లలో ఉండే ఆల్కాహాల్ కారణంగా నోట్లో లాలాజలం ఉత్పత్తి చేసే పొరలు నశిస్తాయి. మన నోట్లో లాలాజలం ఉత్పత్తి అవ్వడం కూడా చాలా అవసరం. నోట్లో బ్యాక్టీరియా పెరగకుండా చేయడంలో కూడా లాలాజలం మనకు ఎంతో ఉపయోగపడుతుంది.
అయితే ఈ మౌత్ వాష్ లను వాడడం వల్ల లాలాజలం ఉత్పత్తి తగ్గుతుంది. అలాగే ఈ మౌత్ వాష్ లలో ఉండే సోడియం లారిల్ సల్ఫేట్ వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా వీటిని వాడడం వల్ల హార్మోన్ల అసమతుల్యత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక మౌత్ వాష్ లలో ఉండే క్లోరో హెక్సిడిన్ దంతాలపై ఉండే ఎనామిల్ ను నష్టపరుస్తాయి. దీంతో దంతక్షయం, దంతాల సెన్సిటివిటీ వంటి సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొంతమంది భోజనానికి ముందు ఈ కెమికల్ మౌత్ వాష్ లతో నోటిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు. ఇలా శుభ్రం చేసుకున్న తరువాత భోజనం చేయడం వల్ల ఈ రసాయనాలు పొట్టలోకి కూడా వెళ్తాయి. దీని కారణంగా పొట్టలో ఉండే సున్నితమైన పొరలు దెబ్బతింటాయి. కనుక సాధ్యమైనంత వరకు నోరు తాజాగా ఉండాలన్నా నోటి దుర్వాసన రాకుండా ఉండాలన్న కెమికల్ మౌత్ వాష్ లను వాడకాన్ని తగ్గించి సహజ సిద్ద పద్దతులను ఉపయోగించడం ఉత్తమం.
నోటి దుర్వాసనను తగ్గించడంలో మనకు పెప్పర్ మెంట్ ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నీటిలో పెప్పర్ మెంట్ ఆయిల్ చుక్కలను వేసి నోట్లో పోసుకుని పుక్కిలించాలి. పుదీనా నుండి ఈ నూనెను తయారు చేస్తారు కనుక ఈ ఆయిల్ మన శరీరానికి ఎటువంటి నష్టాన్ని కలిగించదు. అలాగే టీ ట్రీ ఆయిల్ ను ఉపయోగించి కూడా మనం మౌత్ వాష్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ ను కూడా నీటిలో వేసి ఆ నీటితో పుక్కిలించాలి. రసాయనాలు కలిగిన మౌత్ వాష్ లను వాడడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఈ ఆయిల్స్ ను ఉపయోగించడం వల్ల రాకుండా ఉంటాయి. ఈ ఆయిల్స్ ను ఉపయోగించడం వల్ల నోరు తాజాగా ఉండడంతో పాటు నోటి దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది. అలాగే దుష్ప్రభావాల బారిన కూడా పడకుండా ఉంటాము.