Vegetable Soup : మనకు రెస్టారెంట్ లలో రకరకాల సూప్ లు లభిస్తాయి. చాలా మంది ఈ సూప్ లను ఇష్టంగా తాగుతూ ఉంటారు. అలాగే మనకు బయట మార్కెట్ లో వివిధ రకాల సూప్ ప్యాకెట్ లు కూడా లభిస్తాయి. వీటిని తీసుకు వచ్చి అప్పటికప్పుడు ఇన్ స్టాంట్ గా తయారు చేసుకుని తాగుతూ ఉంటాం. మనం ఇష్టంగా తాగే సూప్ లలో వెజిటేబుల్ సూప్ ఒకటి. రెస్టారెంట్ లకు వెళ్లే పని లేకుండా బయట కొనుగోలు చేసే పనిలేకుండా అదే రుచితో ఈ వెజిటేబుల్ సూప్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా తరిగిన బీన్స్ – 4, చిన్నగా తరిగిన క్యాప్సికం – 1, అల్లం తరుగు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూన్, క్యారెట్ తరుగు – పావు కప్పు, స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, నిమ్మకాయ – అర చెక్క, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి – అర టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, కొత్తిమీర – కొద్దిగా, నూనె – అర టేబుల్ స్పూన్.
మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి. తరువాత మిగిలిన కూరగాయ ముక్కలన్నీ వేసి 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. ఇలా వేయించిన తరువాత 2 గ్లాసుల నీళ్లు పోసి ఉడికించాలి. నీళ్లు మరిగిన తరువాత ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి. తరువాత ఈ కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని సూప్ లో వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ తయారవుతుంది. దీనిని వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవడం వల్ల మరింత రుచిగా ఉంటుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం వంటి సమస్యలు వేధిస్తున్నప్పుడు లేదా వేడి వేడిగా ఏదైనా తాగాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు ఎంతో రుచిగా ఉండే వెజిటేబుల్ సూప్ ను తయారు చేసుకుని తాగవచ్చు.