Banana Face Pack : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో అరటి పండు కూడా ఒకటి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. అరటి పండ్లు మనకు విరివిరిగా అన్ని కాలాల్లోనూ లభిస్తాయి. వీటిని తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అరటి పండ్లలో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన ప్రయోజనాలతోపాటు అరటి పండును ఉపయోగించి చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. మన చర్మంపై ఉండే నలుపును తొలగించే సౌందర్య సాధనంగా అరటి పండు మనకు ఉపయోగపడుతుంది.
అరటి పండును ఉపయోగించి చర్మాన్ని తెల్లగా మార్చే ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. ఈ ఫేస్ ప్యాక్ ను ఎలా ఉపయోగించాలి.. అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం ముందుగా ఒక అరటి పండును తీసుకుని ముక్కలుగా చేసుకోవాలి. తరువాత వాటిని జార్ లో వేసి మెత్తగా గుజ్జుగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పెరుగును, ఒక టీ స్పూన్ పాల పొడిని, ఒక టీ స్పూన్ తేనెను, ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసి బాగా కలపాలి.
ఈ ఫేస్ ప్యాక్ ను ఉపయోగించే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత ఈ అరటి పండు మిశ్రమాన్ని బ్రష్ తో కానీ.. చేత్తో కానీ.. ముఖానికి రాసుకోవాలి. 15 నుండి 20 నిమిషాల తరువాత ముఖాన్ని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గడంతోపాటు ఎండ వల్ల నల్లగా మారిన చర్మం కూడా తెల్లగా మారుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ను వాడడం వల్ల చర్మంపై ఉండే మృత కణాలు తొలగిపోతాయి. చర్మం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది.
ఈ ఫేస్ ప్యాక్ ను ముఖంతోపాటు మెడ, మోచేతులు, మోకాళ్లు వంటి ఇతర శరీర భాగాలపై కూడా ఉపయోగించవచ్చు. అరటి పండులో అధికంగా ఉండే ఆమైనో యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ముఖంపై ఉండే నలుపును తొలగించి ముఖాన్ని తెల్లగా, కాంతివంతంగా కనబడేలా చేయడంలో సహాయపడతాయి. ఇలా అరటి పండుతో సహజసిద్ధంగా చాలా తక్కువ ఖర్చులోనే ఫేస్ ప్యాక్ ను చేసుకుని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.