Curry Leaves For Hair : పట్టులాంటి మెరిసే జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఈ సమస్య వేధిస్తుందని చెప్పవచ్చు. మార్కెట్ లో కూడా జుట్టు రాలడాన్ని తగ్గించే వివిధ రకాల ఉత్పత్తులు లభిస్తున్నాయి. వాటిని వాడడం వల్ల ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అలాగే దుష్ప్రభావాలు కూడా అధికంగా ఉంటాయి. అయితే ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సహజ సిద్దమైన పదార్థాలను ఉపయోగించి మనం మన జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. జుట్టును సంరక్షించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి నూనె మనందరికీ తెలిసిందే. దీనిని ప్రతిరోజూ జుట్టుకు రాసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. కేవలం కొబ్బరి నూనెను మాత్రమే కాకుండా దానిలో ఇతర పదార్థాలను కలిపి రాసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. ముందుగా కొబ్బరి నూనెను వేడి చేయాలి. నూనె వేడయ్యాక మందార పువ్వులు వేసి 5 నిమిషాల పాటు వేడి చేయాలి. తరువాత మెంతులను వేసి మరో 2 నిమిషాల పాటు వేడి చేయాలి. తరువాత ఈ నూనెను వడకట్టి చల్లగా అయ్యే వరకు ఉంచి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కొబ్బరి నూనెను రెండు రోజులకు ఒకసారి రాత్రి పడుకునే ముందు తలకు రాసి ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, ఆరోగ్యవంతంగా పెరుగుతుంది.
అలాగే జుట్టును సంరక్షించడంలో ఆముదం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే రిస్నోలిక్ ఆమ్లం జుట్టుకు చక్కటి పోషణను ఇస్తుంది. ఆముదం నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఆముదం నూనెను వాడడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. ఆముదం నూనెను తలకు రాసి మర్దనా చేయడం వల్ల కుదుళ్లకు చక్కటి పోషణ అంది జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది.
జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కరివేపాకు మనకు ఎంతో సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో కరివేపాకును వేసి నల్లగా అయ్యే వరకు వేయించాలి. తరువాత ఈ నూనెను వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను రెండు రోజులకు ఒకసారి తలకు రాసి 45 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత గాఢత తక్కువగా ఉండే షాంపూను ఉపయోగించి తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు తెల్లబడకుండా, రాలకుండా ఉంటుంది.
కోడిగుడ్డును ఉపయోగించి కూడా మనం జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కోడిగుడ్డులో మన జుట్టుకు అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. నెలకొకసారి ఎగ్ హెయిర్ మాస్క్ ను వేసుకోవడం వల్ల జుట్టు మృదువుగా, ఒత్తుగా ఉంటుంది. జుట్టు పెరుగుదలలో ఉల్లిపాయ కూడా మనకు దోహదపడుతుంది. ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు పట్టించి ఆరే వరకు అలాగే ఉండాలి. ఈ మిశ్రమం ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు రాలడం త్గగడంతోపాటు జుట్టు తెల్లబడకుండా కూడా ఉంటుంది.
అదే విధంగా జుట్టుకు సంబంధించిన ప్రతి సమస్యను మనం కలబందను ఉపయోగించి నయం చేసుకోవచ్చు. చుండ్రు, జుట్టు పొడిబారడం, జుట్టు రాలడం వంటి సమస్యలను తగ్గించడంలో కలబంద ఎంతగానో సహాయపడుతుంది. కలబందలో ఉండే ఆమైనో ఆమ్లాలు జుట్టు ఎదుగుదలకు సహకరిస్తాయి. తలస్నానం చేయడానికి పది నిమిషాల ముందు కలబంద గుజ్జును కుదుళ్లకు బాగా పట్టించాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు పొడిబారకుండా కూడా ఉంటుంది.
అదే విధంగా పావు కప్పు కలబంద గుజ్జులో 2 టీ స్పూన్ల పెరుగు, ఒక టీ స్పూన్ తేనె కలిపి పేస్ట్ గా చేయాలి. దీనిని జుట్టంతటికీకి పట్టించాలి. అరగంట తరువాత తలస్నానం చేయడం వల్ల సమస్యలు తగ్గి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.