Dandruff : నేటికాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తున్న జుట్టు సంబంధిత సమస్యల్లో చుండ్రు సమస్య కూడా ఒకటి. చుండ్రు సమస్య రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వంశపారపర్యంగా కూడా చుండ్రు సమస్య వస్తుంది. అధిక ఒత్తిడికి గురైనా కూడా చుండ్రు సమస్య తలెత్తుతుంది. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. అలాగే ఎక్కువ సమయం ఏసీ గదుల్లో గడుపుతూ ఉంటారు. అదే విధంగా ఎక్కువ సమయం ఫ్యాన్ ల కింద కూర్చుంటారు. దీని వల్ల తలమీది చర్మం పొడిగా అయ్యి పొట్టులా లేస్తుంది. తలస్నానం చేసేటప్పుడు తలకు అంటుకున్న షాంపూ పూర్తిగా వదలకపోయినా కూడా చుండ్రు సమస్య వస్తుంది.
తలకు రాసే షాంపూలో మినరల్స్, ఐరన్ ఎక్కువైనా కూడా చుండ్రు సమస్య అధికమవుతుంది. కలుషిత వాతావరణం కూడా చుండ్రు సమస్యను మరింత పెంచుతుంది. వాతావరణ మార్పులు కూడా తలలో చుండ్రును పెంచుతాయి. పోషకాహార లోపం, హార్మోన్ల అసమతుల్యత వంటి కారణాల చేత కూడా చుండ్రు సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య నుండి బయటపడడానికి ఎక్కువగా షాంపూల మీద, మందుల మీద ఆధారపడకూడదు. ఇంట్లో తయారు చేసుకున్న పదార్థాలను ఉపయోగించడం, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చుండ్రు సమస్యను ఇట్టే నయం చేసుకోవచ్చు. తలలో వచ్చే చుండ్రు సమస్యను నివారించే గుణం బిర్యానీ ఆకుకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
బిర్యానీ ఆకు మీద జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందని వారు తెలియజేస్తున్నారు. సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన బిర్యానీ ఆకును ఉపయోగించి చుండ్రు సమస్య నుండి ఎలా బయట పడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా బిర్యానీ ఆకును ముక్కలుగా చేసి నీటిలో నానబెట్టాలి. తరువాత ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక బిర్యానీ ఆకులను వేడి చేయాలి. తరువాత ఈ నీటిని వడకట్టి గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని తలకు రాసి సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా వారానికి మూడు నుండి నాలుగు సార్లు చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గు ముఖం పడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
అదే విధంగా బిర్యానీ ఆకును నీటిలో నానబెట్టి పేస్ట్ గా చేసి తలకు పట్టించిన కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇలా బిర్యానీ ఆకులను పేస్ట్ గా చేసి వాడడం వల్ల చుండ్రు సమస్యతోపాటు జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. తలపై జుట్టు లేని ప్రాంతంలో ఈ పేస్ట్ ను రాయడం వల్ల దీనిలో ఉండే నూనెలు జుట్టులోకి వెళ్లి తిరిగి జుట్టును బాగా పెరిగేలా చేయడంలో సహాయపడతాయి. అదే విధంగా చుండ్రు సమస్యను నివారించుకోవాలంటే ఎక్కువగా ఆకుకూరలు, పీచు పదార్థాలు ఉన్న ఆహారాలను, విటమిన్ ఎ ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి.
కూరగాయలు, చేపలు మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. వేపుడు పదార్థాలను తీసుకోకూడదు. చుండ్రు సమస్యను నయం చేసే మరిన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తలస్నానం చేయడానికి అరగంట ముందు పుల్లటి పురుగులో, నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల తలలో చుండ్రు రాకుండా ఉంటుంది. అలాగే నిమ్మరసంలో ఉసిరికాయ రసాన్ని కానీ ఉసిరికాయ పొడిని కానీ కలిపి తలకు రాసి మర్దనా చేయాలి. ఇలా చేసిన ఒక గంట తరువాత తలస్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల కూడా చుండ్రు సమస్య నుండి బయటపడవచ్చు.
అలాగే వారానికి రెండుసార్లు గోరు వెచ్చని కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి తలకు రాసి మర్దనా చేయాలి. తరువాత వేడి నీటితో తడిపిన టవల్ ను తలకు చుట్టి అరగంట పాటు అలాగే ఉండాలి. ఆ తరువాత తలస్నానం చేయడం వల్ల జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది. చుండ్రు సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మెంతులను నానబెట్టి పేస్ట్ గా చేసి తలకు రాయాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఈ విధంగా బిర్యానీ ఆకును లేదా ఈ చిట్కాలను ఉపయోగించి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చుండ్రు సమస్యను శాశ్వతంగా నివారించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.