Fish Prickle : చేపలు అంటే చాలా మందికి ఇష్టమే. వాటిని మాంసాహార ప్రియులు చాలా మంది ఇష్టంగా తింటారు. చేపల కూర, వేపుడు, బిర్యానీ.. ఇలా ఏం చేసినా, ఎలా చేసినా చేపలను బాగా లాగించే వారు కూడా ఉన్నారు. అయితే ఇంత వరకు ఓకే. కానీ చేపలను తినేటప్పుడు పొరపాటున దాని ముల్లు గొంతులో ఇరుక్కుంటేనో..? అంటే.. అవును.. ఆ చాన్స్ ఉంది. అందుకే చేప ముక్కలను తినేటప్పుడు చాలా మంది జంకుతారు. వాటిని నెమ్మదిగా తింటారు. అయినా.. పొరపాటున చేపల ముళ్లు గొంతులో ఇరుక్కుంటే..? అప్పుడు ఏం చేయాలో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే ఎవర్నయినా పొట్ట మీద గట్టిగా ఒత్తమని చెప్పాలి. దీంతో గాలి అన్నవాహికకు ప్రసారమవుతుంది. అదే పనిగా ఒత్తుతూ ఉంటే గాలికి ఆ ముల్లు బయటకు వస్తుంది. లేదంటే లోపల జీర్ణాశయంలోనికి చేరుతుంది. అక్కడికి చేరితే ఇబ్బందేమీ ఉండదు. ఎలాంటి పదార్థన్నయినా అరిగించే శక్తి మన కడుపులో యాసిడ్‌కు ఉంటుంది. కనుక పొట్టలోకి వెళ్లిన ముల్లు గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక చేప ముల్లు గొంతులో ఇరుక్కుపోయిన వ్యక్తిని వంగమని చెప్పాలి. ఎవరైనా ఆ వ్యక్తుల వీపుపై కొట్టాలి. దీంతో ముల్లు బయటకు వస్తుంది. ఆ సమయంలో నోరు తెరచి ఉంచాల్సి ఉంటుంది.
చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వండిన అన్నాన్ని ఒక కప్పు మోతాదులో తీసుకుని దాన్ని అలాగే నమలకుండా మింగేయాలి. వెంటనే నీరు తాగాలి. దీంతో గొంతులో ఉన్న ముల్లు పోతుంది. ఒక అరటి పండును తీసుకుని సగానికి కొరికి నమలకుండానే అలాగే దాన్ని మింగాలి. అనంతరం నీరు తాగాలి. ఇలా చేస్తే గొంతులో ఉన్న ముల్లు పోతుంది. రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకుని బాగా నమిలి మింగాలి. అవి కూడా ముల్లును లోపలకి తీసుకుపోతాయి. బ్రౌన్ బ్రెడ్ పీస్‌ను ఒకటి తీసుకుని దానికి రెండు వైపులా పీనట్ బటర్ రాయాలి. అనంతరం బ్రెడ్‌ను నోట్లో పెట్టుకుని మెత్తగా అయ్యేవరకు అలాగే ఉండాలి. అనంతరం దాన్ని నమలకుండా మింగాలి. వెంటనే నీరు తాగాలి. దీంతో ఆ బ్రెడ్‌కు అతుక్కుని ముల్లు లోపలికి పోతుంది.
పైన చెప్పిన చిట్కాలు పనిచేయకపోతే ప్రయోగాలు చేయడం మాని వైద్యున్ని సంప్రదించడం బెటర్. లేదంటే గాయమై ఇన్ఫెక్షన్ బారిన పడతారు. ఆ తరువాత బాధపడి ప్రయోజనం ఉండదు.