Village Style Chicken Curry : సండే రోజు అందరూ నాన్ వెజ్ ను ఎక్కువగా తింటూ ఉంటారు. నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తినే వాటిల్లో చికెన్ ఒకటి. చికెన్ తో ప్రతి వంటకం చాలా రుచిగా ఉంటుంది. అయితే చాలా మంది చికెన్ లో ఏవో పొడులు వేసి చేస్తుంటారు. ఇలా చేసే చికెన్ రుచిగా ఉన్నప్పటికి విలేజ్ స్టైల్ చేసే చికెన్ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ కూరను గ్రామాల్లో పాత రోజుల్లో ఎలా తయారు చేసే వాళ్లో .. అలాగే తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – ఒక కిలో, పసుపు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండున్నర టీ స్పూన్స్, ధనియాల పొడి – ఒకటిన్నర టీ స్పూన్, గరం మసాలా పొడి – ముప్పావు టీ స్పూన్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, తరిగిన పచ్చిమిర్చి – 3, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1 ( పెద్దది), తరిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్నగా తరిగిన టమాటాలు – 2 ( చిన్నవి), కారం – 2 టీ స్పూన్స్, నీళ్లు – తగినన్ని, ఉప్పు – తగినంత.
విలేజ్ స్టైల్ చికెన్ తయారీ విధానం..
ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అందులో పావు టీ స్పూన్ పసుపు, రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా పొడి, ఒక టీ స్పూన్ నూనె వేసి బాగా కలపాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడాయ్యక పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి వేయించాలి. ఉల్లిపాయ వేగిన తరువాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత కొత్తిమీర వేసి కలపాలి. ఇప్పుడు ముందుగ సిద్దం చేసుకున్న చికెన్ ను వేసి బాగా కలపాలి. తరువాత దీనిపై మూతను ఉంచి చికెన్ ను ఉడికించాలి. చికెన్ కొద్దిగా ఉడికిన తరువాత టమాట ముక్కలను వేసి కలిపి మరలా మూత పెట్టి ఉడికించాలి.
టమాట ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత కారం, ఉప్పు వేసి కలపాలి. దీనిని 2 నిమిషాల పాటు ఉడికించిన తరువాత తగినన్ని నీళ్లు పోసి కలపాలి. తరువాత చికెన్ పూర్తిగా ఉడికి దగ్గర పడిన తరువాత ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. దీనిని మరో 3 నిమిషాల పాటు ఉడికించిన తరువాత కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల విలేజ్ స్టైల్ లో చేసే చికెన్ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పులావ్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల చక్కటి రుచిని కలిగి ఉండే పల్లెటూరి చికెన్ కూర తయారవుతుంది.