Pulipirlu : మనల్ని వేధించే చర్మ సంబంధిత సమస్యల్లో పులిపిర్లు కూడా ఒకటి. మనలో చాలా మంది ఈ పులిపిర్లతో ఇబ్బంది పడుతుంటారు. పులిపిర్ల వల్ల మనకు ఎటువంటి హాని కలగనప్పటికి ఇవి చూడడానికి అందవిహీనంగా ఉంటాయి. ఇవి మెడ భాగంలో, ముఖం మీద ఎక్కువగా వస్తూ ఉంటాయి. శరీరంలో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల కూడా పులిపిర్లు వస్తాయి. కొన్ని రకాల పులిపిర్లు క్యాన్సర్ కు దారి తీస్తాయి. ఈ పులిపుర్లను తొలగించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. కొంతమంది వీటిని చాకుతో లేదా బ్లేడుతో కోస్తుంటారు. అలా చేయడం ఏ మాత్రం మంచి పద్దతి కాదు. ఈ పులిపిర్లను కొన్ని రకాల చిట్కాలను వాడడం వల్ల చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. పులిపిర్లను తగ్గించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పులిపిర్లను తొలగించడంలో వెల్లుల్లి రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లి రెబ్బల నుండి రసాన్ని తీసి దాన్ని పులిపిర్ల మీద రాయాలి. ఇలా తరచూ చేయడం వల్ల పులిపిర్లు తొలగిపోతాయి. అలాగే ఆపిల్ సైడ్ వెనిగర్ ను ఉపయోగించి కూడా మనం పులిపిర్లను తగ్గించుకోవచ్చు. ఒక గిన్నెలో నీటిని తీసుకుని దానిలో ఆపిల్ సైడ్ వెనిగర్ ను వేసి కలపాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి పులిపిర్ల మీద రాయాలి. ఇలా క్రమం తప్పకుండా పులిపిర్ల మీద రాస్తూ ఉండడం వల్ల పులిపిర్లు తగ్గిపోతాయి. పులిపిర్లను తగ్గించడంలో అరటి పండు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముందుగా అరటి పండును అలాగే అరటి పండు తొక్కను ముక్కలుగా చేయాలి. రాత్రి పడుకునే ముందు పులిపిర్ల మీద అరటి పండు ముక్కను ఉంచి దాని మీద అరటి పండు తొక్కను ఉంచాలి. వీటి మీద ప్లాస్టర్ ను వేయాలి. ఉదయం లేవగానే దీనిని తీసి వేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా చేయడం వల్ల పులిపిర్లు తగ్గిపోతాయి.
పులిపిర్లను తొలగించడంలో కొత్త సున్నం చక్కగా పని చేస్తుంది. కొత్త సున్నంలో అల్లం రసం కలిపి పులిపిర్ల మీద రాస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పులిపిర్లు రాలిపోతాయి. అలాగే ఉల్లిపాయ, రాతి ఉప్పును ఉపయోగించి కూడా మనం పులిపిర్లను తగ్గించుకోవచ్చు. ఉల్లిపాయను అడ్డంగా కోసి దానికి రాతి ఉప్పును అద్ది పులిపిర్ల మీద రుద్దాలి. ఇలా చేయడం వల్ల కూడా పులిపిర్లు తగ్గిపోతాయి. ఉత్తరేణి ఆకులను, తులసి ఆకులతో కలిపి నూరాలి. ఈ మిశ్రమానికి ఆవు నెయ్యిని కలిపి పులిపిర్ల మీద రాయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పులిపిర్లను నివారించడంలో విటమిన్ ల పాత్ర ఎంతో ఉంటుంది. విటమిన్ ఎ మరియు విటమిన్ సి ఎక్కువగా ఉండే క్యారెట్, ఉసిరికాయను ఉపయోగించి పులిపిర్లను తగ్గించుకోవచ్చు.
ముందుగా ఒక గిన్నెలో క్యారెట్ రసాన్ని తీసుకోవాలి. తరువాత అందులో ఉసిరికాయ రసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని పులిపిర్ల మీద రాయాలి. ఇలా తరచూ చేయడం వల్ల పులిపిర్లను నివారించుకోవచ్చు. పులిపిర్లను, వాటి మచ్చలను తొలగించడంలో కలబంద గుజ్జు ఎంతగానో ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జులో దూదిని ముంచి పులిపిర్ల ఉంచి టేప్ ను అతికించాలి. రాత్రి పడుకునే ముందు ఇలా చేసి ఉదయాన్నే దీనిని తొలగించాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల ఎటువంటి హాని లేకుండా చాలా సులభంగా పులిపిర్లను, పులిపిర్ల వల్ల కలిగే మచ్చలను తగ్గించుకోవచ్చు.