Throat Pain : సాధారణంగా సీజన్లు మారేకొద్దీ మనకు దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయి. అయితే వర్షాకాలంలో ఈ సమస్యలు మనల్ని మరింత బాధిస్తాయి. దీంతోపాటు గొంతు నొప్పి, ఇన్‌ఫెక్షన్, గొంతులో దురద వంటి సమస్యలు కూడా ఇబ్బందులు పెడుతుంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే దెబ్బకు గొంతు నొప్పి తగ్గుతుంది. దీంతోపాటు ఇతర గొంతు సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇక గొంతు నొప్పిని తగ్గించే ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
గొంతు నొప్పి, గొంతు ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో యాలకులు బాగా పనిచేస్తాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో గొంతు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పూటకు ఒక యాలక్కాయ చొప్పున నోట్లో వేసుకుని బాగా నమిలి మింగాలి. అనంతరం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లను తాగాలి. ఇలా రోజుకు 3 పూటలా చేయాలి. దీంతో గొంతు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఒక లవంగాన్ని కాస్త రాళ్ల ఉప్పుతో కలిపి దంచి తినాలి. అనంతరం గోరు వెచ్చని నీళ్లను తాగాలి. ఇలా రోజుకు 3 సార్లు చేయాలి. దీంతో గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ వంటివి తగ్గుతాయి.
ఒక టీస్పూన్ తేనెలో అంతే మోతాదులో అల్లం రసం కలిపి సేవించాలి. రోజుకు మూడు సార్లు ఇలా తీసుకుంటే సమస్యల నుంచి చక్కని ఉపశమనం లభిస్తుంది. అలాగే రాత్రి పూట ఒక గ్లాస్ పాలలో అర టీస్పూన్ మిరియాల పొడి, పావు టీస్పూన్ పసుపు కలిపి తాగాలి. దీంతో తెల్లారేసరికి గొంతు సమస్యలు అన్నీ తగ్గుతాయి. ముఖ్యంగా గొంతు నొప్పి, మంట, దురద నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా సహజసిద్ధమైన చిట్కాలతో గొంతు సమస్యల నుంచి బయట పడవచ్చు.