Coriander Leaves : మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంలో మూత్రపిండాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. శరీరం సక్రమంగా పని చేయాలంటే మూత్రపిండాలు నిరంతరం పని చేయాలి. శరీరంలో ఎన్నో మలినాలను, వ్యర్థపదార్థాలను వడపోసి మూత్రపిండాలు బయటకు పంపిస్తాయి. మూత్రపిండాల ఆరోగ్యం అనేది మనం తీసుకునే నీటి శాతంపై ఆధారపడి ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది తగినన్ని నీటిని తాగకపోవడం వల్ల మూత్రపిండాల సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు.
మూత్రపిండాల ఆరోగ్యం నీటితోపాటు ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బ తింటుంది. మద్యం మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. కనుక మద్యాన్ని తీసుకోవడం మానేయాలి. అలాగే మనలో కొంతమంది మూత్రం వచ్చినప్పుడు విసర్జించకుండా ఆపుకుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తుంది. ఇలా చేయడం వల్ల మూత్ర పిండాల్లో రాళ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా మనం వంటల్లో రుచి కొరకు ఉప్పును ఉపయోగిస్తూ ఉంటాం. ఉప్పులో సోడియం అధికంగా ఉంటుంది.
మనం అధికంగా తీసుకునే ఉప్పు మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది అధిక రక్తపోటుకు కూడా దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక రోజుకు 5 నుండి 6 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పును తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా పంచదారను ఎక్కువగా తీసుకున్నా కూడా మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రోటీన్స్ మూత్రం ద్వారా పోయే అవకాశం ఉంటుంది. కనుక తీపి పదార్థాలకు, శీతల పానీయాలకు దూరంగా ఉండడం మంచిది. అదే విధంగా మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్ర కూడా చాలా అవసరం.
అధికంగా ప్రోటీన్లను తీసుకోవడం వల్ల కూడా మూత్ర పిండాల ఆరోగ్యం దెబ్బ తింటుంది. అందువల్ల శరీరానికి తగినన్ని ప్రోటీన్లను మాత్రమే తీసుకోవాలి. ఇక శరీరంలో మినరల్స్, విటమిన్స్ లోపం కూడా మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. విటమిన్ బి6, మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలాగే సహజ సిద్దంగా మూత్రపిండాలను ఎలా శుభ్రపరుచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
మూత్రపిండాలను శుభ్రపరచడంలో కొత్తిమీర నీరుఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నీటిని తయారు చేసుకోవడానికి గాను ముందుగా ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. నీరు వేడయ్యాక శుభ్రంగా కడిగిన కొత్తిమీరను తరిగి వేయాలి. తరువాత ఈ నీటిని బాగా మరిగించి వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కొత్తిమీర నీటిని రోజూ ఉదయం పరగడుపున రెండు నెలల పాటు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మూత్రం రంగు మారుతుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. మూత్రపిండాలు శుభ్రపడతాయి. ఈ చిట్కాలను పాటించడం వల్ల మనం మూత్రపిండాల అలాగే మూత్రాశయ సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.