Oily Skin : మనలో చాలా మంది నల్ల మచ్చలు, పిగ్మేంటేషన్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీటి వల్ల ముఖం కాంతివిహీనంగా తయారవుతుంది. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల, శరీరంలో విటమిన్ కె తక్కువ అవ్వడం వల్ల, మేకప్ ఎక్కువగా వేసుకోవడం వల్ల పిగ్మేంటేషన్, నల్ల మచ్చలు వంటివి వస్తాయి. ఈ సమస్యల నుండి బయట పడడానికి ఎన్నో రకాల సౌందర్య సాధనాలను వాడుతూ ఉంటారు. ఎంతో ఖర్చు చేస్తుంటారు. ఇలా బయట దొరికే వాటిని వాడడానికి బదులుగా ఇంటి చిట్కాలను ఉపయోగించి కూడా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో చందనం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చందనం చర్మాన్ని అందంగా, శుభ్రంగా ఉంచుతుంది. చర్మానికి టోనర్ లా కూడా చందనం పని చేస్తుంది. చందనాన్ని ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అలాగే నిమ్మరసం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉన్న సిట్రిక్ యాసిడ్ బ్లాక్ హెడ్స్ ను, వైట్ హెడ్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది. అదే విధంగా రోజ్ వాటర్ ను ఉపయోగించి కూడా మనం చర్మాన్ని అందంగా ఉంచుకోవచ్చు. ఈ పదార్థాలతో చిట్కాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక గిన్నెలో చందనాన్ని, నిమ్మరసాన్ని, రోజ్ వాటర్ ను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరిన తరువాత నీటితో కడిగేయాలి. ఈ చిట్కాను తరచూ వాడడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. అలాగే బార్లీ గింజల పొడి, తులసి ఆకుల పేస్ట్, రోజ్ వాటర్ ను ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కూడా ముఖానికి రాసుకుని ఆరిన తరువాత నీటితో కడిగేయాలి. ఇది చర్మానికి మంచి స్క్రబర్ లా పని చేస్తుంది. చర్మాన్ని అందంగా ఉంచడంలో బొప్పాయి పండ్ల గుజ్జు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఒక గిన్నెలో బొప్పాయి పండ్ల గుజ్జును, ముల్తానీ మట్టిని, పసుపును వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఈ మిశ్రమం బాగా ఆరిన తరువాత నీటితో కడిగేయాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా వారానికి మూడుసార్లు చేయడం వల్ల పిగ్మెంటేషన్ ను నివారించుకోవచ్చు. అదే విధంగా కర్పూరం పొడిని ఉపయోగించి కూడా మనం చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఒక గిన్నెలో కర్పూరం పొడిని, ముల్తానీ మట్టిని, నిమ్మరసాన్ని వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా పిగ్మేంటేషన్ ను నివారించుకోవచ్చు.
అలాగే కొబ్బరి నూనెలో, కర్పూరం పొడిని వేసి కలిపి నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ ఉన్న చోట ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా చక్కటి ఫలితం ఉంటుంది. ఈ చిట్కాలను వాడడం వల్ల నల్లటి మచ్చలను, పిగ్మేంటేషన్ లతోపాటు ఇతర చర్మ సంబంధిత సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.