Pippi Pannu : మనల్ని వేధించే దంత సంబంధిత సమస్యల్లో పిప్పి పళ్ల సమస్య కూడా ఒకటి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రస్తుత కాలంలో చాలా మంది పిప్పి పళ్ల సమస్యతో బాధపడుతున్నారు. పూర్వకాలంలో మన పెద్దలు 60 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా చక్కని దంతాల అమరికను కలిగి ఉండే వారు. కానీ ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల్లో కూడా అనేక దంత సమస్యలు వస్తున్నాయి. కేవలం పిప్పి పళ్ల సమస్యనే కాకుండా దంతాలపై గార పట్టడం, చల్లని, వేడి పదార్థాలను తినలేకపోవడం, దంతాల నొప్పి వంటి అనేక దంత సంబంధిత సమస్యలతో బాధపడే వారు ప్రస్తుత కాలంలో ఎక్కువవుతున్నారు.
సహజ సిద్ధంగా కూడా మనం దంత సంబంధిత సమస్యలన్నింటి నుండి బయటపడవచ్చు. దంతాల సమస్యలను నయం చేసే చిట్కాల గురించి ఇప్పుడు తెలుపుకుందాం. మన ఇండ్లలో లవంగాలు ఉంటాయి. ఈ లవంగాలను తీసుకుని మెత్తగా పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని దూదితో కానీ, చేత్తో కానీ నొప్పి ఉన్న దంతాలపై ఉంచాలి. అ లవంగాల పొడిని మన నోట్లో కనీసం 5 నిమిషాల పాటు ఉంచుకోవాలి. లవంగాల పొడిని నోట్లో ఉంచుకున్నప్పుడు ఎక్కువగా లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి అయిన లాలాజలాన్ని ఉమ్మివేయకుండా నోట్లో అలాగే ఉంచుకోవాలి.
5 నిమిషాల తరువాత నోటిని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల త్వరగా దంతాల నొప్పి తగ్గుతుంది. అలాగే దంతాల నొప్పిని నివారించడంలో ఆవనూనె కూడా మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ ఆవనూనెను తీసుకుని తరువాత అందులో పావు టీ స్పూన్ పసుపును కలుపుకోవాలి. తరువాత ఇందులోనే ఒక టీ స్పూన్ పటిక బెల్లం పొడిని కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని బ్రష్ తో తీసుకుని పిప్పి పళ్లను శుభ్రం చేసుకోవడం వల్ల పిప్పి పళ్లవల్ల కలిగే నొప్పి తగ్గుతుంది.
అలాగే ఈ మిశ్రమంతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల నోట్లో ఉండే క్రిములు నశిస్తాయి. అంతేకాకుండా దంతాలపై గార కూడా తొలగిపోతుంది. ఈ విధంగా ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం దంత సంబంధిత సమస్యల నుండి బయటపడవచ్చు.