Alu Paratha : మనం వంటింట్లో గోధుమ పిండిని ఉపయోగించి రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. గోధుమ పిండితో చేసే ఆహార పదార్థాల్లో ఆలూ పరాటాలు కూడా ఒకటి. వీటిని మనం ఎక్కువగా ఉదయం అల్పాహారంలో భాగంగా తయారు చేస్తూ ఉంటాం. ఆలూ పరాటాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఇష్టంగా తినే వారు కూడా చాలా మందే ఉంటారు. ఆలూ పరాటాలను రుచిగా, చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ పరాటా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమ పిండి – 2 కప్పులు, ఉడికించి మెత్తగా చేసిన బంగాళాదుంపలు – 3, ఉప్పు – తగినంత, నీళ్లు – ఒక కప్పు లేదా తగినంత, నూనె – అరకప్పు, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 2, తరిగిన కరివేపాకు – ఒక రెబ్బ, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – చిటికెడు, కారం – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మరసం – ఒక టీ స్పూన్.
ఆలూ పరాటా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండిని తీసుకుని అందులో రుచికి తగినంత ఉప్పును వేసి కలుపుకోవాలి. తరువాత ఒక కప్పు నీళ్లను పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. తరువాత రెండు టీ స్పూన్ల నూనె వేసి అంతా కలిసేలా బాగా కలిపి మూత పెట్టి అరగంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత పచ్చి మిర్చి ముక్కలను, కరివేపాకును, ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత పసుపును, అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి పచ్చి వాసన పోయేలా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.
తరువాత జీలకర్ర పొడిని, ధనియాల పొడిని, ఉప్పును, కారాన్ని వేసి కలిపి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత మెత్తగా చేసిన బంగాళాదుంపలను వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు వేయించి చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత నిమ్మ రసాన్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కలిపి ఉంచిన గోధుమ పిండిని తీసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కావల్సిన పరిమాణంలో పిండిని తీసుకుని ముద్దలుగా చేసుకోవాలి.
తరువాత ఒక్కో ముద్దను తీసుకుంటూ మధ్యలో మందంగా అంచులుగా పలుచగా ఉండేలా గుంత గిన్నె ఆకారంలో చేతి వేళ్లతో వత్తుకోవాలి. ఇలా వత్తుకున్న తరువాత అందులో ఆలుగడ్డ మిశ్రమాన్ని ఉంచి అంచులతో మూసేసి గుండ్రంగా చేసుకోవాలి. ఇలా అన్ని ముద్దలను చేసుకున్న తరువాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ ముద్దలన్నీ అతుక్కు పోకుండా వాటిపై పొడి పిండిని చల్లుకోవాలి. ఇప్పుడు ఒక్కో ముద్దను తీసుకుంటూ పొడి పిండిని చల్లుతూ చపాతీలా వత్తుకోవాలి.
తరువాత స్టవ్ మీద పెనాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక వత్తుకున్న పరోటాను వేయాలి. ఈ పరాటాను తగినంత నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ పరోటాలు తయారవుతాయి. ఇలా చేసిన పరాటాలను అందరూ ఇష్టంగా తింటారు. వంటరాని వారు కూడా ఈ విధంగా ఆలూ పరాటాలను చాలా సులభంగా, రుచిగా తయారు చేసుకోవచ్చు.