Gas Trouble Remedies : మనల్ని వేధించే జీర్ణసంబంధిత సమస్యల్లో గ్యాస్ ట్రబుల్ ఒకటి. కడుపులో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల గ్యాస్ సమస్య తలెత్తుతుంది. ఆధునిక కాలంలో మారిన జీవనశైలి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, తీవ్ర మానసిక ఒత్తిడి, తగినంత నిద్రపోకపోవడం, సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వంటి వాటిని గ్యాస్ సమస్య రావడానికి కారణాలుగా చెప్పవచ్చు. కదలకుండా ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం, అధికంగా టీ, కాఫీలు తాగడం వంటి వాటిని కూడా ఈ సమస్యకు కారణాలుగా చెప్పవచ్చు. చాలా మంది ఈ సమస్య నుండి ఉపశమనాన్ని పొందడానికి బయట మార్కెట్ లో గ్యాస్ ను నివారించే సిరప్ లను, ట్యాబెట్లను, వివిధ రకాల పొడులను ఉపయోగిస్తూ ఉంటారు.
వీటిని వాడడం వల్ల తాత్కాలిక ఉపశమనం కలిగినప్పటికి వీటిని తరచూ వాడడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొన్న రకాల చిట్కాలను పాటించడం వల్ల గ్యాస్ సమస్య నుండి మనం శాశ్వతంగా బయటపడవచ్చు. గ్యాస్ సమస్య నుండి బయటపడాలంటే ధ్యానం, యోగా వంటివి నిత్యం చేయాలి. వీటిని చేయడం వల్ల మానసిక ఒత్తిడి దరిచేరకుండా ఉంటుంది. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. టీ, కాఫీ వంటి వాటికి దూరంగా ఉండాలి. మసాలాలు, వేపుళ్లు, ఫాస్ట్ ఫుడ్ తినడం మానేయాలి. మద్యపానం, ధూమపానం చేయకూడదు. సమయానికి ఆహారాన్ని తీసుకుంటూ తగినన్ని నీటిని తాగాలి. నిల్వ ఉంచిన పచ్చళ్లు తినయం మానేయాలి.
గ్యాస్ సమస్యతో బాధపడే వారు ప్రతిరోజూ ఉదయం పరగడుపున శొంఠి పొడిని, పాత బెల్లాన్ని సమపాళ్లల్లో కలిపి తీసుకోవాలి. వెంటనే గోరు వెచ్చని నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి.నీళ్లు వేడయ్యాక శొంఠిపొడి, ధనియాలు వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ధనియాల కషాయాన్ని రోజూ రాత్రి పడుకునే ముందు తాగాలి. ఈ ధనియాల కషాయాన్ని తాగడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో పాటు మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది.
అదేవిధంగా కడుపు అంతా కూడా శుభ్రపడుతుంది. గ్యాస్ సమస్యను నివారించడంలో అల్లం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక కచ్చాపచ్చాగా దంచిన అల్లాన్ని అలాగే దానికి తగిన మోతాదులో బెల్లాన్ని కూడా వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. గ్యాస్ సమస్య ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ విధంగా అల్లం కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల గ్యాస్ సమస్య మన దరి చేరకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.