Hair Grow Tip : జుట్టు రాలడం, జుట్టు చిట్లడం, జుట్టు తెల్లబడడం, జుట్టు తెగిపోవడం వంటి వివిధ రకాల జుట్టు సంబంధిత సమస్యలతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతున్నారు. జుట్టు సంబంధిత సమస్యలు తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాతావరణ కాలుష్యం, పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం, రసాయనాలు కలిగిన షాంపులను, కండీష్ నర్ లను వాడడం, అలాగే వివిధ రకాల అనారోగ్య సమస్యల కారణంగా కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు.
అయినప్పటికి ఫలితం లేక నిరుత్సాహపడుతూ ఉంటారు. ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం రెండంటే రెండు పదార్థాలను ఉపయోగించి ఒక చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా సులభంగా జుట్టు సమస్యలన్నింటిని తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి ఉపయోగించే రెండు పదార్థాలు కూడా సహజ సిద్దమైనవే. కనుక దీనిని వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. జుట్టు సమస్యలను నయం చేసే ఆ రెండు పదార్థాలు ఏమిటి… వాటితో చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం కలబంద గుజ్జును, కొబ్బరి నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది.
ముందుగా కలబంద కాడను తీసుకుని దాని నుండి గుజ్జును వేరు చేయాలి. తరువాత దీనిని జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కలబంద మిశ్రమాన్ని 4 టేబుల్ స్పూన్ల మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను వేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు పట్టించాలి. తరువాత నూనె చర్మంలోకి ఇంకేలా మర్దనా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రెండు గంటల పాటు అలాగే ఉంచుకోవాలి. రెండు గంటల తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో తలస్నానం చేయాలి. సమయం ఎక్కువగా ఉన్న వారు ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు జుట్టుకు పట్టించి అలాగే ఉంచుకోవాలి.
ఉదయాన్నే తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా, నల్లగా, పొడవుగా పెరుగుతుంది. జుట్టు మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. జుట్టు చిట్లడం, తెగడం తగ్గుతుంది. జుట్టుకు కావల్సిన పోషకాలు అందడం వల్ల జుట్టు ధృడంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. ఈ విధంగా ఈ చిట్కాను వాడడం వల్ల జుట్టు సమస్యలన్నింటిని చాలా సులభంగా దూరం చేసుకోవచ్చు.