Pachi Mirchi Fry : పచ్చిమిర్చి.. ఇది తెలియని వారుండరు. వంటల్లో దీనిని మనం విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇతర కూరగాయల వలె పచ్చిమిర్చి కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కూరలల్లో వేయడంతో పాటు పచ్చిమిర్చిని ఉపయోగించి పచ్చళ్లు కూడా చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా పచ్చిమిర్చితో మనం ఎంతో రుచిగా ఫ్రైను కూడా తయారు చేసుకోవచ్చు. ఇతర కూరలతో సైడ్ డిష్ గా తింటే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. పచ్చిమిర్చి ఫ్రైను తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎంతో రుచిగా ఉండే పచ్చిమిర్చి ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చిమిర్చి ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
బజ్జీ మిర్చి – 10, పుట్నాల పప్పు – 150 గ్రా., జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు – 4, నూనె – 4 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత.
పచ్చిమిర్చి ఫ్రై తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో పుట్నాల పప్పు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా కలపాలి. ఇప్పుడు పచ్చిమిర్చికి నిలువుగా గాట్లు పెట్టుకోవాలి. తరువాత ఈ పచ్చిమిర్చిలో ముందుగా తయారు చేసుకున్న పొడిని స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చిని వేసి మూత పెట్టాలి. ఈ మూతలో కొద్దిగా నీటిని పోసి పచ్చిమిర్చిని వేయించాలి. పచ్చిమిర్చి ఒకవైపు వేగిన తరువాత వాటిని నెమ్మదిగా కదిపి మరలా మూత పెట్టి వేయించాలి.
పచ్చిమిర్చి రెండు వైపులా వేగిన తరువాత మిగిలిన పొడిని వేసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పచ్చిమిర్చి ఫ్రై తయారవుతుంది. ఈ ఫ్రైను పప్పు, సాంబార్, రసం, పెరుగు వంటి వాటితో సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. పచ్చిమిర్చితో తరచూ చేసే వంటకాలతో పాటు అప్ంపుడప్పుడూ ఇలా ఫ్రైను కూడా తయారు చేసుకుని తినవచ్చు.