Headache : ఒక్కరోజూ సరిగ్గా నిద్రపోకపోయిన, ఒత్తిడి అలాగే ఆందోళన ఎక్కువైనా ముందుగా మనకు వచ్చే అనారోగ్య సమస్య తలనొప్పి. అలాగే థైరాయిడ్, మైగ్రేన్ కారణంగా కూడా కొందరిలో తలనొప్పి వస్తుంది. అదే విధంగా తీసుకున్న ఆహార పదార్థాల మూలంగా కూడా తలనొప్పి వస్తుంది. తలనొప్పి సమస్య తలెత్తగానే చాలా మంది ఏదో ఒక పెయిన్ కిల్లర్ ను, తలనొప్పి మాత్రలను వేసుకుంటూ ఉంటారు. కానీ వీటిని తరచూ వాడడం వల్ల మనం భవిష్యత్తులో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా కేవలం నిమిషాల వ్యవధిలోనే ఇంటి చిట్కాను ఉపయోగించి మనం తలనొప్పిని తగ్గించుకోవచ్చు. ఈ చిట్కా చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి మనం కేవలం రెండు పదార్థాలను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఇవి రెండు కూడా మన వంటగదిలో ఉండేవే. తలనొప్పిని తగ్గించే ఇంటి చిట్కా ఏమిటి.. దీనిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం ఉపయోగించాల్సిన పదార్థాల్లో లవంగాలు ఒకటి. ఇవి మనందరికి తెలిసినవే. లవంగాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. లవంగాలను ఉపయోగించడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మధుమేహం అదుపులో ఉంటుంది. అలాగే తలనొప్పిని తగ్గించడంలో కూడా లవంగాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు నొప్పిని తగ్గించడంలో దోహదపడతాయి. అలాగే లవంగాలు పెయిన్ కిల్లర్ గా కూడా పనిచేస్తాయి. తలనొప్పితో పాటు కీళ్ల నొప్పులు, దంతాల నొప్పులును తగ్గించడంలో కూడా లవంగాలు ఉపయోగపడతాయి. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా 6 లవంగాలను తీసుకోవాలి. వీటిని రోట్లో లేదా జార్ లో వేసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఈ పొడిలో పావు టీ స్పూన్ సైంధవ లవణాన్ని వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి.
సైంధవ లవణం తలలో ఉండే ద్రవాలను పీల్చేసి తలనొప్పిని తలనొప్పి తీవ్రతను కూడా తగ్గిస్తుంది. ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక గ్లాస్ గోరు వెచ్చని ఆవు పాలల్లో లేదా గేదే పాలల్లో వేసి కలిపి తలనొప్పి అనిపించగానే తాగాలి. ఇలా మిశ్రమాన్ని తయారు చేసుకుని పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల నిమిషాల్లో తలనొప్పి తగ్గుతుంది. అలాగే తలనొప్పి తరచూ ఇబ్బంది పెడుతున్నప్పుడు చాక్లెట్, మాంసం, వెన్న వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్ ను తీసుకోకూడదు. విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బి 12, మాంసకృత్తులు, క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. తాజా పండ్లు, ఆకుకూరలను ఆహారంగా తీసుకోవాలి. అలాగే తగినంత నీటిని తాగాలి. రోజుకు కనీసం 8 గంటల పాటు నిద్రపోవాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల తలనొప్పి తగ్గడంతో పాటు మరలా రాకుండా కూడా ఉంటుంది.