Sweet Corn Masala Curry : స్వీట్ కార్న్‌తో మ‌సాలా కూర త‌యారీ ఇలా.. చ‌పాతీల్లోకి ఎంతో అద్భుతంగా ఉంటుంది..

Sweet Corn Masala Curry : మ‌నం ఆహారంగా స్వీట్ కార్న్ కూడా తీసుకుంటూ ఉంటాం. స్వీట్ కార్న్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు కూడా వీటిలో అధికంగా ఉన్నాయి. వీటిని ఉడికించి తీసుకోవ‌డంతో పాటు ర‌క‌ర‌కాల వంట‌కాల్లో కూడా ఉప‌యోగిస్తూ ఉంటారు. అలాగే ఈ స్వీట్ కార్న్ తో మ‌నం ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వంట‌రాని వారు కూడా దీనిని చ‌క్క‌గా చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే స్వీట్ కార్న్ మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్వీట్ కార్న్ మ‌సాలా కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

స్వీట్ కార్న్ – 1, త‌రిగిన ఉల్లిపాయ – 1 ( పెద్ద‌ది), త‌రిగిన ట‌మాటాలు – 3, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, నువ్వులు – ఒక టీ స్పూన్, పుచ్చ గింజ‌ల ప‌ప్పు – ఒక టీ స్పూన్, జీడిప‌ప్పు – 2 టీ స్పూన్స్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, నీళ్లు – అర గ్లాస్, ఫ్రెష్ క్రీమ్ – ఒక టీ స్పూన్, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Sweet Corn Masala Curry recipe in telugu better taste with chapati
Sweet Corn Masala Curry

స్వీట్ కార్న్ మ‌సాలా కూర త‌యారీ విధానం..

ముందుగా స్వీట్ కార్న్ గింజ‌ల‌ను సేక‌రించి మెత్త‌గా ఉడికించి ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత జార్ లో నువ్వులు, పుచ్చ గింజ‌ల ప‌ప్పు, జీడిప‌ప్పు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అదే జార్ లో ట‌మాట ముక్క‌ల‌ను వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు, ఉప్పు, ప‌సుపు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన తరువాత అల్లం పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత కారం, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత ట‌మాట పేస్ట్ వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు క‌లుపుతూ ఉడికించాలి. త‌రువాత జీడిప‌ప్పు పేస్ట్ వేసి మ‌ర‌లా క‌లుపుతూ నూనె పైకి తేలే వ‌ర‌కు బాగా వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి ముక్క‌లు, ఉడికించిన స్వీట్ కార్న్ గింజ‌లు వేసి క‌ల‌పాలి.

త‌రువాత నీళ్లు పోసి మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు 5 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత గ‌రం మ‌సాలా, క‌సూరి మెంతి, ఫ్రెష్ క్రీమ్ వేసి క‌లపాలి. దీనిని మ‌రో నిమిషం పాటు ఉడికించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే స్వీట్ కార్న్ మ‌సాలా కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, నాన్, రోటి, పులావ్, బిర్యానీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. స్వీట్ కార్న్ తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా మ‌సాలా కూర‌ను కూడా తయారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ కూర‌ను అంద‌రూ ఇష్టంగా తింటారు.

D

Recent Posts