సాధారణంగా చాలా మంది ముఖం, జుట్టు తదితర భాగాల సంరక్షణకు అనేక చిట్కాలను పాటిస్తుంటారు. కానీ మెడ విషయానికి వస్తే అంతగా పట్టించుకోరు. దీంతో ఆ భాగంలో నల్లగా మారుతుంది. అయితే మెడ భాగంలో ఏర్పడే నల్లదనాన్ని పోగొట్టేందుకు పలు చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కలబంద గుజ్జులో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మంపై పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తాయి. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. కలబంద గుజ్జును కొద్దిగా తీసుకుని మెడపై రాసి 20 నిమిషాల పాటు వేచి ఉన్నాక నీటితో కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే నలబడ్డ మెడ తెల్లగా మారుతుంది.
2. చర్మం పీహెచ్ స్థాయిలను సరి చేసేందుకు యాపిల్ సైడర్ వెనిగర్ ఎంతగానో పనిచేస్తుంది. ఇందులో ఉండే మాలిక్ యాసిడ్ మృత చర్మ కణాలను తొలగిస్తుంది. చర్మానికి సహజసిద్ధమైన మెరుపును ఇస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్, 4 టేబుల్ స్పూన్ల నీటిని తీసుకుని బాగా కలపాలి. ఆ మిశ్రమంలో కాటన్ బాల్ ముంచి దాంతో మెడపై రాయాలి. 10 నిమిషాలు ఆగాక నీటితో కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే మెడపై నల్లదనం తగ్గుతుంది. సహజ రంగు వస్తుంది.
3. చర్మంలో పేరుకుపోయిన మట్టి, మృతకణాలు, ఇతర పదార్థాలను తొలగించేందుకు బేకింగ్ సోడా బాగా పనిచేస్తుంది. 2-3 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను కొద్దిగా నీటితో కలిపి మెత్తని, మృదువైన పేస్ట్‌లా తయారు చేయాలి. దాన్ని మెడపై రాయాలి. 10 నిమిషాలు ఆగాక నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే సమస్య తగ్గుతుంది.
4. ఆలుగడ్డలలో బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. అందువల్ల చర్మాన్ని తేలికపరుస్తాయి. చర్మానికి చక్కని టోన్‌ను అందిస్తాయి. చిన్న ఆలుగడ్డ తీసుకుని పొట్టు తీసి బాగా తురమాలి. అనంతరం ఆ మిశ్రమం నుంచి రసాన్ని తీయాలి. తరువాత కాటన్ బాల్‌తో ఆ రసంలో ముంచి దాన్ని మెడపై రాయాలి. కొన్ని నిమిషాల పాటు అలాగే ఉండి తరువాత కడిగేయాలి. దీంతో సమస్య నుంచి బయట పడవచ్చు.
5. రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి, అర టీస్పూన్ నిమ్మరసం, కొద్దిగా పసుపు, రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దాన్ని మెడపై రాయాలి. 15 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మెడపై ఉండే నలుపుదనం పోతుంది.