Acidity : మనం పాటించే జీవనశైలి చాలా వరకు మనకు అనారోగ్యాలను కలిగిస్తుంది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం వల్లే మనం ఎక్కువగా వ్యాధుల బారిన పడతాము. ఇక కడుపులో మంట అనేది మనం తీసుకునే ఆహారాల వల్లే ఎక్కువగా వస్తుంది. కారం, మసాలాలు అధికంగా ఉన్న ఆహారాలను తినడం లేదా పులుపు అధికంగా ఉన్న ఆహారాలను తింటే అసిడిటీ వస్తుంది. అలాగే టీ, కాఫీ ఎక్కువగా తాగినా, వీటిని ఖాళీ కడుపుతో ఎక్కువగా తాగినా కూడా అసిడిటీ వస్తుంది. అయితే ఈ సమస్య నుంచి బయట పడేందుకు మనకు పలు ఇంటి చిట్కాలు పని చేస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
జీలకర్ర నీళ్లను తాగడం వల్ల గ్యాస్, అసిడిటీ నుంచి సత్వరమే ఉపశమనం లభిస్తుంది. అలాగే జీర్ణక్రియ కూడా మెరుగు పడుతుంది. జీలకర్ర నీళ్లను తాగడం వల్ల అధిక బరువు కూడా తగ్గుతారు. ఇందుకు గాను ఒకపాత్రలో నీళ్లను తీసుకుని అందులో జీలకర్ర ఒక టీస్పూన్ వేసి మరిగించాలి. నీళ్లు రంగు మారే వరకు మరిగించిన తరువాత నీళ్లను వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. దీంతో కడుపులో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.
కడుపులో మంట లేదా పొట్ట ఉబ్బరం సమస్యలు ఉన్నవారు 4-5 పుదీనా ఆకులను అలాగే నమిలి మింగాలి. అనంతరం గోరు వెచ్చని నీళ్లను తాగాలి. దీంతో పొట్టకు రెస్ట్ లభిస్తుంది. వెంటనే రీఫ్రెష్ అయినట్లు ఫీలవుతారు. అలాగే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సోంపు గింజలతో తయారు చేసిన డికాషన్‌ను తాగడం వల్ల కూడా కడుపులో మంట నుంచి బయట పడవచ్చు. సోంపు గింజలను నీళ్లలో వేసి మరిగించి నీరు రంగు మారగానే వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఈ నీళ్లను రాత్రి తాగితే నిద్ర చక్కగా పడుతుంది.
ఇక కొత్తిమీర ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగుతున్నా కూడా కడుపులో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. కొత్తిమీర జీర్ణ సమస్యలకు చక్కగా పనిచేస్తుంది. ఇది అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అందువల్ల కొత్తిమీర నీళ్లను కూడా తాగవచ్చు.