Bagara Baingan : వంకాయలతో చేసే కూరలు అంటే సహజంగానే చాలా మందికి ఎంతగానో ఇష్టం ఉంటుంది. ఈ క్రమంలోనే వంకాయలతో అనేక రకాల వంటలను చేసి తింటుంటారు. వీటితో చేసే మసాలా వంటకాలు రుచిలో అద్భుతంగా ఉంటాయి. అందుకనే చాలా మంది వంకాయ వంటకాలను తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక వంకాయలతో మనం చేసుకోదగిన వంటల్లో ఒకటి.. బాగారా బైంగన్. దీన్ని చాలా సులభంగా తయారు చేయవచ్చు. ఇందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో, దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయలు – 600 గ్రాములు, ఆవాలు – 25 గ్రాములు, జీలకర్ర – 25 గ్రాములు, కొబ్బరి – 100 గ్రాములు, చింత పండు – 50 గ్రాములు, కారం పొడి – 300 గ్రాములు, పసుపు – 20 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 100 గ్రాములు, ఉప్పు – 20 గ్రాములు, నూనె – 100 గ్రాములు, నువ్వులు – 50 గ్రాములు, కరివేపాకు – 5 గ్రాములు, జీడిపప్పు – 100 గ్రాములు.
ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి ఒక దానిలో రెండు ముక్కలు చేయాలి. ఒక గిన్నెలో కొబ్బరి, నువ్వులు, చింత పండు వేసి కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు పాన్ తీసుకుని అందులో నూనె వేసి కొబ్బరి, చింతపండు, నువ్వుల పేస్ట్‌ను వేయాలి. గ్రేవీని సన్నని మంట మీద మరిగించాలి. గ్రేవీలో వంకాయ ముక్కలు వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. కారం పొడి, పసుపు, ఉప్పు వేసి కలపాలి. మరికాసేపు మంటపై ఉంచితే వంకాయలు ఉడుకుతాయి. కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. ఇలా బగారా బైంగన్‌ను వండితే ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. దీన్ని రైస్‌లో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.