నిత్యం ఎండలో ఎక్కువగా తిరిగే వారి చర్మం సూర్యకాంతి కారణంగా తన సహజ రంగును కోల్పోతుంది. దీంతో చర్మమంతా వేరే గోధుమ, ఎరుపు లేదా నలుపు రంగులోకి మారుతుంది. దీన్నే ట్యానింగ్ అని కూడా అంటారు. అయితే చాలా మంది ట్యానింగ్‌ను తొలగించుకోవడం కోసం పలు రకాల పద్ధతులను పాటిస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి సమస్య నుంచి బయట పడడం కష్టంగా కూడా ఉంటుంది. అయితే కింద ఇచ్చిన పలు టిప్స్‌ను పాటిస్తే ట్యానింగ్‌ను సులభంగా తగ్గించుకోవచ్చు. దీంతో చర్మం తన సహజ రంగును పొందుతుంది. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తగినన్ని బంగాళాదుంపలను తీసుకుని బాగా ఉడకబెట్టి చల్లార్చాలి. అనంతరం ఫ్రిజ్‌లో ఉంచి బాగా చల్లగా అయ్యేలా చూడాలి. అనంతరం వాటిని నలిపి సమస్య ఉన్న ప్రదేశంలో రాయాలి. దీంతో వాటి నుంచి విడుదలయ్యే కాటెకొలాస్ అనే ఓ రసాయనం చర్మాన్ని శుభ్రం చేసే పనిలో పడుతుంది. దీంతో ట్యానింగ్ సులభంగా తగ్గిపోతుంది.
కొన్ని ఐస్ ముక్కలను తీసుకుని ట్యానింగ్ ఉన్న ప్రాంతంలో సున్నితంగా మర్దనా చేసినట్టు రాయాలి. దీంతో ఆ ప్రదేశంలో చర్మం శుభ్ర పడుతుంది. అంతేకాదు ట్యానింగ్ నుంచి ఉపశమనం లభిస్తుంది. నారింజ పండు తొక్కను తీసి లోపలి భాగంతో ముఖంపై రుద్దుకున్నా ట్యానింగ్ సమస్యను తొలగించుకోవచ్చు. పసుపు, చందనంలను సమ భాగాల్లో తీసుకుని ఆ మిశ్రమానికి కొంత నీటిని కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను సమస్య ఉన్న ప్రదేశంలో రాసి కొంత సేపు ఆగాక కడిగేయాలి. దీంతో ట్యానింగ్ తొలగిపోతుంది. ముల్తానీ మట్టి, నీరు కలిపి ఫేస్‌ప్యాక్‌లా వేసుకున్నా ట్యానింగ్‌ను తొలగించుకోవచ్చు. దీంతో చర్మం మృదువుగా కూడా మారుతుంది. తేనెలో యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కొద్దిగా తేనెను తీసుకుని ముఖంపై రాసి కొంత సేపు ఆగాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. ట్యానింగ్ సమస్య పోతుంది. తేనెలో నిమ్మరసం కూడా కలుపుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.
అలోవెరా జెల్‌ను లేదా జ్యూస్‌ను సమస్య ఉన్న ప్రాంతంలో రాసి కొంత సేపు ఆగాక కడిగేయాలి. అలోవెరాలో ఉన్న ఔషధ గుణాలు ట్యానింగ్ సమస్య నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ట్యానింగ్ వల్ల వచ్చే దురద కూడా తగ్గుతుంది. ఒక కీరదోసకాయను తీసుకుని దాన్ని మెత్తని పేస్ట్‌లా మిక్స్ చేసుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రదేశంలో రాయాలి. దీంతో ట్యానింగ్ తగ్గిపోతుంది. అంతేకాదు చర్మం చల్లదనాన్ని పొంది కాంతివంతమవుతుంది. ట్యానింగ్ ను తగ్గించడంలో రోజ్ వాటర్ కూడా బాగానే పనిచేస్తుంది. కొద్దిగా నీటిని తీసుకుని అందులో 4,5 చుక్కల రోజ్ వాటర్‌ను కలపాలి. ఆ మిశ్రమంతో ముఖాన్ని కడిగేసుకోవాలి. దీంతో చర్మ మృదువుగా మారుతుంది. ట్యానింగ్ తగ్గుతుంది.
అతి మధురం పొడిలో చల్లని పాలను కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. దీన్ని సమస్య ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఆ మిశ్రమంలో ఉండే గ్లైకోసైడ్స్, సాపోనిన్స్, ఫ్లేవనాయిడ్స్ చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మం కాంతివంతంగా అయ్యేలా చేస్తాయి. కొబ్బరినూనె, కర్పూరంలను కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. దాన్ని సమస్య ఉన్న ప్రదేశంపై రాస్తే ట్యానింగ్ తగ్గుతుంది. చర్మం మృదుత్వాన్ని పొందుతుంది. కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకుని దాన్ని నీటిలో కలపాలి. ఆ మిశ్రమాన్ని రాస్తే ట్యానింగ్‌ను తగ్గించుకోవచ్చు. చల్లని పెరుగును ట్యానింగ్ ఉన్న ప్రదేశంలో రాస్తుంటే సమస్య తగ్గిపోతుంది. పెరుగులో ఉండే ప్రొ బయోటిక్, కాల్షియం, ప్రోటీన్, జింక్ తదితర మూలకాలు చర్మాన్ని సంరక్షిస్తాయి. కొద్దిగా బేకింగ్ సోడాను తీసుకుని నీటిలో కలిపి మిశ్రమంగా చేయాలి. దాన్ని రాస్తుంటే ట్యానింగ్ సమస్య నుంచి బయట పడవచ్చు. చల్లని పాలను డైరెక్ట్‌గా అప్లై చేసినా ట్యానింగ్ సమస్య నుంచి బయట పడవచ్చు. దీంతో చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.