Joint Pain : నేటి తరుణంలో మనలో చాలా మంది కీళ్ల నొప్పులు, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. పూర్వకాలంలో వయసు పైబడిన వారిలోనే కనిపించే ఈ కీళ్ల నొప్పులు ప్రస్తుత కాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. మారిన ఆహారపు అలవాట్లు, పోషకాహార లోపం, జీవనశైలిలో మార్పులు వంటి వివిధ రకాల కారణాల చేత కీళ్లనొప్పుల సమస్య తలెత్తుతుంది. చలికాలంలో అయితే ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో కీళ్ల నొప్పులు మరింత తీవ్రతరం అవుతాయి. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి పెయిన్ కిల్లర్ లను వాడుతూ ఉంటారు. అయితే వీటిని వాడడం వల్ల సమస్య నుండి ఉపశమనం కలిగినప్పటికి వీటిని దీర్ఘకాలం పాటు వాడడం వల్ల అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
పెయిన్ కిల్లర్ లను వాడడానికి బదులుగా చిన్న ఇంటి చిట్కాను ఉపయోగించి కూడా మనం చాలా సులభంగా ఈ కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు వైద్యున్ని సంప్రదించడం మంచిది. అయితే కీళ్ల నొప్పుల సమస్య తక్కువగా ఉన్నా లేదా ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ చిట్కాను వాడడం వల్ల క్రమంగా కీళ్ల నొప్పుల సమస్య తగ్గడంతో పాటు కీళ్ల మధ్య గుజ్జు కూడా ఎక్కువగా తయారవుతుంది. కీళ్ల నొప్పులను తగ్గించే ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం ఒక టీ స్పూన్ తేనెను, అర టీ స్పూన్ నువ్వులను, పావు టీ స్పూన్ శొంఠి పొడిని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో తేనెను తీసుకోవాలి.
తరువాత ఇందులో నువ్వులు, శొంఠి పొడి వేసి కలపాలి. దీనిని 10 నిమిషాల పాటు పక్కకు ఉంచిన తరువాత తినాలి. ఇలా క్రమం తప్పకుండా 15 రోజుల పాటు తీసుకోవడం వల్ల క్రమంగా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కీళ్లల్లో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. అలాగే నువ్వుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ విధంగా ఈ చిట్కాను వాడడం వల్ల కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు వంటి సమస్య తగ్గడంతో పాటు ఎముకలు కూడా ధృడంగా తయారవుతాయి.