Hotel Style Ravva Idli : హోట‌ల్ స్టైల్‌లో ర‌వ్వ ఇడ్లీల‌ను ఇలా చేయండి.. ఎంతో అద్భుతంగా ఉంటాయి..!

Hotel Style Ravva Idli : మ‌న‌కు హోట‌ల్స్ లో ల‌భించే వివిధ ర‌కాల రుచిక‌ర‌మైన టిఫిన్స్ లో ర‌వ్వ ఇడ్లీ కూడా ఒక‌టి. ర‌వ్వ‌తో చేసే ఈ ఇడ్లీలు మెత్త‌గా, గుల్ల‌గుల్ల‌గా చాలా రుచిగా ఉంటాయి. ఈ ఇడ్లీల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ ఇడ్లీల‌ను మ‌నం కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేసుకోవ‌డానికి పిండి రుబ్బే ప‌నిలేదు. ఇన్ స్టాంట్ గా వీటిని త‌యారుచేసుకోవ‌చ్చు. ఉద‌యం పూట స‌మ‌యం త‌క్కువగా ఉన్న‌ప్పుడు ఇలా ర‌వ్వ‌తో ఇడ్లీల‌ను తయారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇన్ స్టాంట్ గా హోట‌ల్ స్టైల్ ర‌వ్వ ఇడ్లీలను ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

హోట‌ల్ స్టైల్ ర‌వ్వ ఇడ్లీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక‌ టీ స్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి ముక్క‌లు- ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన క‌రివేపాకు – ఒక రెమ్మ‌, చిన్న‌గా త‌రిగిన క్యారెట్ ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, బొంబాయి ర‌వ్వ – ఒక క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, వంట‌సోడా – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, పెరుగు – ఒక క‌ప్పు, నీళ్లు – కొద్దిగా.

Hotel Style Ravva Idli recipe in telugu very tasty easy to make
Hotel Style Ravva Idli

హోట‌ల్ స్టైల్ ర‌వ్వ ఇడ్లీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప‌ప్పు, ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి ముక్క‌లు, క‌రివేపాకు, క్యారెట్ ముక్క‌లు వేసి వేయించాలి. క్యారెట్ ముక్క‌లు వేగిన త‌రువాత ర‌వ్వ వేసి క‌ల‌పాలి. ఈ ర‌వ్వ‌ను చిన్న మంట‌పై దోర‌గా వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ ర‌వ్వ‌ను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఉప్పు, కొత్తిమీర‌, వంట‌సోడా,పెరుగు వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసుకుని ఇడ్లీ పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత ఈ పిండిని ఇడ్లీ ప్లేట్ ల‌లో వేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత ఇడ్లీ కుక్క‌ర్ లో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత ఇడ్లీ ప్లేట్ ల‌ను ఉంచి మూత పెట్టి ఉడికించాలి. వీటిని 12 నుండి 15 నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి అలాగే ఉంచాలి. ఇడ్లీలు కొద్దిగా చ‌ల్లారిన త‌రువాత ప్లేట్ నుండి తీసి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే హోట‌ల్ స్టైల్ ర‌వ్వ ఇడ్లీలు త‌యార‌వుతాయి. వీటిని చ‌ట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ ఇడ్లీల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts