Kapham : వాతావరణం మారినప్పుడల్లా మనలో చాలా మంది దగ్గు, జలుబు, గొంతులో కఫం వంటి సమస్యల బారిన పడుతూ ఉంటారు. కొందరూ తరచూ ఈ సమస్యల బారిన పడుతూ ఉంటారు. ప్రస్తుత కాలంలో బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్ ల వల్ల కలిగే ఈ దగ్గు, జలుబు అనేవి సర్వసాధారణమైపోయాయి. కొందరిలో వీటి కారణంగా జ్వరం కూడా వస్తుంది. చాలా మంది వీటి బారిన పడగానే యాంటీ బయాటిక్ మందులను, దగ్గు సిరప్ లను వాడుతూ ఉంటారు. వీటి వల్ల ఉపశమనం కలిగినప్పటికీ వీటిని వాడడం వల్ల భవిష్యత్తులో మనం అనేక దుష్ప్రభావాల బారిన పడాల్సి వస్తుంది. మందులను వాడకుండా సహజ సిద్ధంగానే ఈ సమస్యల బారి నుండి మనం బయట పడవచ్చు. దగ్గు, జలుబు, కఫం, జ్వరం వంటి సమస్యలు వేధిస్తున్నప్పుడు లంకనాలు (ఉపవాసం) చేస్తూ తేనె నీటిని తీసుకుంటూ ఉండాలి.
లంకనాలు చేస్తూ తేనె నీటిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి త్వరగా ఉపశమనాన్ని పొందవచ్చు. అసలు ఈ తేనె నీటిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అలాగే ఈ నీటిని ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తేనె నీటిని తయారు చేయడం చాలా సులభం. ముందుగా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీ స్పూన్ మిరియాల పొడిని, అర టీ స్పూన్ యాలకుల పొడిని కలపాలి. తరువాత ఇందులో 5 నుండి 6 టీ స్పూన్ల తేనెను వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల తేనె నీళ్లు తయారవుతాయి. ఈ నీటిని రోజుకు పూటలా పూటకు గ్లాస్ చొప్పున తీసుకోవాలి. ఈ విధంగా తేనె నీటిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు త్వరగా తగ్గుతాయి. అలాగే గొంతులో, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం, శ్లేష్మం పలుచబడి సులభంగా తొలగిపోతుంది.
ఈ తేనె నీటిని పిల్లలకు కూడా ఇవ్వవచ్చు. ఇలా తేనె నీటిని తీసుకుంటూ మధ్య మధ్యలో తేనె, నిమ్మరసం కలిపిన నీటిని లేదా మామూలు నీటిని, కొబ్బరి నీటిని తీసుకుంటూ లంకనాలు చేయాలి. ఇలా చేయడం వల్ల జీర్ణాశయం శుభ్రపడడంతో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ విధంగా తేనె నీటిని తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభించి నీరసం రాకుండా ఉంటుంది. అలాగే దగ్గు, జలుబు, కఫం వంటి సమస్యల నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. యాంటీ బయాటిక్ లను, దగ్గు సిరప్ లను వాడడానికి బదులుగా ఇలా సహజ పద్దతులను ఉపయోగించడం వల్ల సమస్య తగ్గడంతో పాటు దుష్ప్రభావాల బారిన కూడా పడకుండా ఉంటాము.