Masala Vada : మనం సాయంత్రం సమయాల్లో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. అందరూ ఇష్టంగా తినే చిరుతిళ్లల్లో మసాలా వడలు కూడా ఒకటి. వీటిని తినని వారు ఉండరనే చెప్పవచ్చు. మసాలా వడలు తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రుచితో పాటు శరీరానికి కూడా మేలు కలుగుతుంది. ఈ మసాలా వడలను రుచిగా, సులువుగా, చక్కగా ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, కరివేపాకు తరుగు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, వెల్లుల్లి తరుగు – పావు టీ స్పూన్, పచ్చిమిర్చి తరుగు – 2 టేబుల్ స్పూన్స్, సోయా ఆకుల తరుగు – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
మసాలా వడ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపప్పును తీసుకుని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ పప్పును నీళ్లు లేకుండా బాగా వడకట్టుకోవాలి. తరువాత దీని నుండి రెండు గుప్పిళ్ల శనగపప్పును తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. మిగిలిన పప్పును జార్ లో వేసి నీళ్లు లేకుండా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పక్కకు తీసి పెట్టుకున్న పప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో నీళ్లు పోయకుండా బాగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని తగిన పరిమాణంలో తీసుకుని వడ ఆకారంలో వత్తుకుని నూనెలో వేసి కాల్చుకోవాలి.
వీటిని రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా వడలు తయారవుతాయి. సాయంత్రం సమయాల్లో ఇలా మసాలా వడలను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. బయట దొరికే చిరుతిళ్లను తినడానికి బదులుగా ఇలా ఇంట్లోనే వడలను తయారు చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది. వీటిని అందరూ ఇష్టంగా తింటారు.