నిత్యం మనం వంటల్లో ఎక్కువగా వాడే జీలకర్రలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. దీంట్లో తెలుపు, నలుపు అని రెండు రకాలు ఉన్నా మనం ఎక్కువగా నల్ల జీలకర్రనే ఉపయోగిస్తున్నాం. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ వంటి ఎన్నో రకాల అద్భుతమైన గుణాలు జీలకర్రలో ఉన్నాయి. ఈ క్రమంలో జీలకర్ర ద్వారా మనకు కలిగే పలు అనారోగ్యాలను ఎలా దూరం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. కడుపులో వికారంగా ఉండి పుల్లని త్రేన్పులతో బాధపడుతున్న వారు కొద్దిగా జీలకర్రను నమిలి రసం మింగితే ఉపశమనం కలుగుతుంది. జీలకర్రను తరచూ నమిలి మింగుతుంటే కడుపులో ఉన్న నులిపురుగులు చనిపోతాయి. జీర్ణ సంబంధ వ్యాధులు తగ్గుముఖం పడతాయి.
జీలకర్రను కషాయంలా కాచి తాగుతుంటే ఎలర్జీ వల్ల కలిగే బాధలు తగ్గుముఖం పడతాయి. అంతేకాదు షుగర్, బీపీలు అదుపులో ఉంటాయి. ఒక టీస్పూన్ జీలకర్రను నీటిలో తీసుకుని ఒక టీస్పూన్ కొత్తిమీర రసం, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటుంటే డయేరియా తగ్గుతుంది. భోజనం తరువాత రోజుకు రెండు సార్లు ఇలా తీసుకుంటే ఫలితం ఉంటుంది. నల్ల జీలకర్రను వేయించి మగ్గిన అరటి పండుతో రోజూ తీసుకుంటుంటే నిద్రలేమి సమస్య తగ్గిపోయి, నిద్ర బాగా పడుతుంది. నీటిలో కొద్దిగా అల్లం వేసి బాగా మరిగించాలి. దాంట్లో ఒక టీస్పూన్ జీలకర్ర కలిపి తీసుకుంటే గొంతు నొప్పి, గొంతు మంట, జలుబు, జ్వరం తగ్గిపోతాయి.
కొత్తిమీరలో జీలకర్ర పొడి, ఉప్పు కలిపి తాగుతుంటే జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. కడుపులోని గ్యాస్ అంతా బయటికి పోతుంది. విరేచనాలు తగ్గిపోతాయి. కొద్దిగా నీటిని తీసుకుని దాంట్లో జీలకర్ర పొడి, మిరియాల పొడి, యాలకుల పొడులను చిటికెడు మోతాదుల్లో వేసి సన్నని మంటపై కషాయంలా కాయాలి. దీన్ని వడకట్టి పరగడుపున తాగితే బీపీ తగ్గుతుంది. శరీరంలోని అదనపు కొవ్వు కరిగిపోతుంది. షుగర్ వ్యాధిని నివారిస్తుంది. అరటి పండుని తీసుకుని దాన్ని బాగా నలిపి దాంట్లో జీలకర్ర పొడిని కలిపి తింటే నిద్ర బాగా వస్తుంది. ఒక టీస్పూన్ నెయ్యిలో ఒక టీస్పూన్ జీలకర్ర పొడిని కలిపి రోజూ పరగడుపున తీసుకుంటే శరీరంలో అల్సర్, పుండ్లు తగ్గిపోతాయి.
నిమ్మరసంలో కాస్త జీలకర్ర పొడిని వేసి కలిపి చెమట పొక్కులు ఎక్కడ ఉన్నా వాటిపైన రాస్తే వెంటనే అవి తగ్గిపోతాయి. కొబ్బరి నూనె లో కాస్త జీలకర్ర పొడి వేసి కాచి తలకి పట్టించి, తరువాత తలస్నానం చేస్తే కళ్ళలో ఉండే వేడి తగ్గుతుంది. చుండ్రు పోతుంది. జుట్టు బలంగా మారుతుంది. బాగా కాచిన ఆవు పాలలో కాస్త మిరియాల పొడి, జీలకర్ర పొడి రెండు టీస్పూన్ల మోతాదులో వేసి బాగా కలిపి తలకు పట్టించి మర్దనా చేయాలి. అనంతరం తలస్నానం చేయాలి. దీంతో జుట్టులో ఉండే ఇన్‌ఫెక్షన్, దురదలు పోతాయి.