5వ తరం యుద్ధ విమానాలు ఇప్పటివరకు మూడే ఉన్నాయి. అమెరికాకు చెందిన ఎఫ్-22 రాప్టర్, ఎఫ్-35 లైట్నింగ్, ఇంకా చైనాకు చెందిన జె-20 (ఇది నిజంగా 5వ తరానికి చెందినదేనా లేక చైనా అబద్ధాలు చెబుతోందా అని అనుమానాలున్నాయి. ఏదైనా యుద్ధంలో ఉపయోగిస్తేగాని వాటి నిగ్గు తేలదు). రష్యాకు చెందిన సుఖోయ్-57 కూడా 5వ తరానికి చెందిన విమానం. కానీ అది ఇంకా చివరి దశ నిర్మాణంలో ఉంది. మిగిలినవన్నీ కూడా ఇంకా వివిధ దశల్లో అభివృద్ధిలో ఉన్నాయి.
ఈ చిత్రంలో ఉన్నది భారతదేశపు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రష్యా దేశపు సుఖోయ్ తో కలిసి సంయుక్తంగా ఆభివృద్ధి చేస్తున్న 5వ తరం విమానపు నమూనా. ఈ విమానానికి పెట్టిన పేరు AMCA (అడ్వాన్స్డ్ మల్టీరోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్). 2030 నాటికి ఇది మన వైమానిక దళంలో చేరవచ్చని అంచనా. ప్రభుత్వం దీని నిర్మాణాన్ని వేగతరం చేస్తున్నది. 2024-26 మధ్య ఈ విమానం సిద్ధమైపోతుందని అంటున్నారు. అంతేగాక దీన్ని 5.5/ 6 వ తరంగా కూడా అభివృద్ధి పరచే ఆలోచనలున్నాయి.
అందుకే 5వ తరం విమానాలను బయటినుండి కొనుగోలుచేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు. పదేళ్ళలో మన విమానం తయారవుతున్నప్పుడు హడావుడిగా ఎక్కువ ధర పెట్టి వాటిని కొనడం ఎందుకు? అంతేకాక అమెరికా విమానాలు చాలా ఖరీదు. అంత ఖరీదు పెట్టి కొన్నా వాటి ఎలక్ట్రానిక్ సిస్టంలు అమెరికా నిఘాలో ఉంటాయి. వాటిని అడగ్గానే అమ్మదు కూడా. ఇక రష్యాతో కలిసి మనమే తయారు చేస్తున్నప్పుడు సుఖోయ్-57 ను కొనడం అనవసరం కదా. ఇప్పటి అవసరాలకు 4.5 తరానికి చెందిన రఫాల్ విమానాలు చక్కగా సరిపోతాయి. అవి 5 వ తరం విమానాలతో పోటీ పడలేవు అని చెప్పలేము. ఎదురెదురు పోరాటంలో (డాగ్ ఫైట్), ఆయుధ వ్యవస్థలలో రెండింటికీ పెద్ద తేడా లేదు.