Marri Udalu For Hair Growth : మన ఇంట్లోనే ఒక నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల జుట్టు రాలడం అనే సమస్య నుండి పూర్తిగా ఉపశమనాన్ని పొందవచ్చు. ఈ నూనె వాడడం వల్ల జుట్టు నల్లగా, ఒత్తుగా, ధృడంగా పెరుగుతుంది. ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది జుట్టు రాలడం, జుట్టు అంద విహీనంగా మారడం, జుట్టు బలంగా లేకపోవడం వంటి వివిధ రకాల జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు సంబంధిత సమస్యలు తలెత్తడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, రసాయనాలు కలిగిన షాంపులను, హెయిర్ డై లను, కండీష్ నర్ లను వాడడం, వివిధ రకాల అనారోగ్య సమస్యల కారణంగా జుట్టు రాలిపోతూ ఉంటుంది.
ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికి జుట్టు సమస్యలు తగ్గక చింతిస్తున్న వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. అలాంటి వారు మన ఇంట్లోనే ఒక నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల మనం జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టును ఒత్తుగా పెంచే ఈ నూనెను ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అలాగే ఈ నూనెను ఎలా ఉపయోగించాలి..అన్న తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నూనెను తయారు చేసుకోవడానికి గానూ మనం కొబ్బరి నూనెను అలాగే మర్రి చెట్టు ఊడలను ఉపయోగించాల్సి ఉంటుంది. మర్రిచెట్టు ఊడలు జుట్టు రాలడాన్ని తగ్గించడంలో మనకు ఎంతగానో ఉపయోగపడతాయి.
ముందుగా మర్రిచెట్టు ఊడలను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత వీటిని రెండు నుండి మూడు రోజుల పాటు ఎండబెట్టాలి. మర్రి ఊడలు పూర్తిగా ఎండిన తరువాత వాటిని ముక్కలుగా చేసి ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత వీటిని పొడిగా చేయాలి. మర్రి ఊడలు పూర్తిగా పొడిలా అవ్వవు. కొద్దిగా బరకగానే ఉంటాయి. ఇప్పుడు కళాయిలో 100 ఎమ్ ఎల్ కొబ్బరి నూనెను తీసుకుని వేడి చేయాలి. ఇందులోనే మిక్సీ పట్టుకున్న మర్రి ఊడల పొడి వేసి కలపాలి. వీటిని చిన్న మంటపై పూర్తిగా నల్లగా అయ్యే వరకు వేయించాలి. మర్రి ఊడలు నల్లగా మారిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. తరువాత ఈ నూనెను వడకట్టి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని కూడా నిల్వ చేసుకోవచ్చు.
ఇలా తయారు చేసుకున్న నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు పట్టించాలి. తరువాత నూనె చర్మంలోకి ఇంకేలా సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఈ నూనెను రోజంతా కూడా మన జుట్టుకు ఉంచుకోవచ్చు లేదా రాత్రి పడుకునే ముందు ఈ నూనెను జుట్టుకు పట్టించి ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా, నల్లగా మర్రి ఊడలంతా పొడవుగా, ధృడంగా పెరుగుతుంది.