Dosakaya Kobbari Pachadi : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో దోసకాయ కూడా ఒకటి. ఇతర కూరగాయల వలె దోసకాయ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దోసకాయతో మనం పప్పు, కూర, పచ్చడి వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. దోసకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ పచ్చడిని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ దోసకాయ పచ్చడినలో కొబ్బరి వేసి మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి వేసి చేసే దోసకాయ పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవలం నిమిషాల వ్యవధిలోనే తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే దోసకాయ కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దోసకాయ కొబ్బరి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా ముక్కలుగా తరిగిన దోసకాయ – 1, పచ్చి కొబ్బరి ముక్కలు – అర కప్పు, పచ్చిమిర్చి – 10 లేదా తగినన్ని, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – తగింనత, చింతపండు – ఒక రెమ్మ.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు -అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 3, కరివేపాకు – రెండు రెమ్మలు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
దోసకాయ కొబ్బరి పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, చింతపండు, ఉప్పు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత దోసకాయ ముక్కలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసి కలపాలి. ఇప్పుడు ఈ తాళింపును ముందుగా తయారు చేసుకున్న పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దోసకాయ కొబ్బరి పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా తినవచ్చు. దోసకాయతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కొబ్బరి వేసి పచ్చడిని కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ పచ్చడిని లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.