Black Spots : మన ప్రమేయం లేకుండానే ముఖం నలల్గా అక్కడక్కడ వివర్ణమై పోతూ ఉంటుంది. ముదురు రంగులో రకరకాల ఆకారాలు ముఖాన్ని ఆక్రమించేస్తూ ఉంటాయి. ఇతరత్రా ఏ ఇబ్బంది పెట్టని ఈ మచ్చలు మనసులో మాత్రం పెద్ద సునామీనే సృష్టిస్తాయి. అందమైన ముఖాన్ని అందవిహీనం చేసే ఈ మచ్చలను మంగు మచ్చలు అని అంటారు. ఈ మచ్చలు ముఖం రెండు వైపులా బుగ్గల పై నుండి ముక్కు వరకు వ్యాపిస్తాయి. ముఖం తో భుజాలు, వీపు, మెడ భాగంలో కూడా వచ్చే అవకాశం ఉంది. మంగు మచ్చలు రావడానికి కొన్ని ప్రధానమైన కారణాలు ఉన్నాయి. మంగు మచ్చలు రావడానికి ప్రధాన కారణం ముఖానికి ఎండ తగలడం. అలా అని ఎండలో తిరిగిన ఇది అందరికి రాదు. కొందరికి మాత్రమే ఈ సమస్యే వస్తుంది. అలాగే స్త్రీ శరీరంలో ఉండే ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల మధ్య అసమతుల్యం వచ్చినప్పుడు మంగు మచ్చలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
గర్భనిరోధక మాత్రలు వేసుకునే వారిలో కూడా ఈ మంగు మచ్చలు వచ్చే అవకాశం ఉంది. అలాగే జన్యుపరంగా కూడా ఈ మంగు మచ్చలు వచ్చే అవకాశం ఉంది. ఈ మంగు మచ్చలను కొన్ని సహజ సిద్ద చిట్కాలతో తగ్గించుకోవచ్చు. మంగు మచ్చలను తగ్గించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ఒక గిన్నెలో పాలను తీసుకోవాలి. తరువాత అందులో రెండు టీ స్పూన్ల ఓట్స్ ను వేసి బాగా మరిగించాలి. చల్లారిన తరువాత మెత్తని ముద్దలాగా చేసి కొద్దిగా పెరుగు కలిపి అరగంట పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరిన తరువాత చల్లటి నీటితో కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం పై మచ్చల సమస్య తగ్గుతుంది. అలాగే పచ్చి పాలల్లో నిమ్మరసం వేసి కలపాలి. ఆ మిశ్రమంతో రాత్రి పడుకునే ముఖాన్ని తుడవాలి. ఐదు నిమిషాల తరువాత ఎర్ర చందనంలో రోజ్ వాటర్ ను కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి.
ఉదయాన్నే చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంగు మచ్చలతో పాటు ఇతర చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. గేదె పాల నుండి తీసిన వెన్నను మంగు మచ్చలపై రోజూ రుద్దుతూ ఉంటే మంగు మచ్చలు తగ్గిపోతాయి. అలాగే పచ్చి పసుపు, చందనం లో పచ్చి పాలను కలిపి పేస్ట్ లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం పై రాయడం వల్ల మంగు మచ్చలతో పాటు ఇతర నల్ల మచ్చలు కూడా తగ్గుతాయి. కోడిగుడ్డు తెల్లసొనలో ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి, మెడకు పట్టించాలి. అరగంట తరువాత గోరు వెచ్చని నీటితో కడగాలి. అదేవిధంగా జాజికాయను మేకపాలల్లో అరగదీసి ఆ మిశ్రమాన్ని మంగు మచ్చలపై రాయాలి.ఇలా చేయడం వల్ల కూడా మంగు మచ్చలు తగ్గుతాయి. ఒక గిన్నెలో నిమ్మరసాన్ని తీసుకుని దానికి సమానంగా తేనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత నీటితో కడిగివేయాలి.
ఇలా నెల రోజుల పాటు చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. టమాట గుజ్జును మచ్చలపై బాగా రాసి 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల మచ్చలు తగ్గి శరీర కాంతి కూడా పెరుగుతుంది. ఒక గిన్నెలో శనగపిండి. పెరుగు, నిమ్మరంసం, రోజ్ వాటర్ వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకుని అరగంట తరువాత కడగాలి. ఈ చిట్కాను పాటించడం వల్ల మంగు మచ్చలతో పాటు ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి. కలబంద గుజ్జును మచ్చలపై రాయాలి. ఆరిన తరువాత నీటితో కడగాలి. దీని వల్ల మచ్చలు తగ్గిపోతాయి. అంతేకాకుండా ముఖం పై ఉండే మొటిమలు కూడా తగ్గుతాయి. బంగాళాదుపం రసంలో దూదిని ముంచి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగి వేయాలి. ఇలా చేయడం వల్ల కూడా చక్కటి ఫలితం ఉంటుంది. ఈ చిట్కాలను పాటించడంతో పాటు తాజా పండ్లను, కూరగాయలను తీసుకోవడం, ఎండలో బయటకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలను పాటించడం వంటివి చేయడం వల్ల మంగు మచ్చలను మనం పూర్తిగా నివారించుకోవచ్చు.