Konaseema Pottikkalu : పొట్టిక్కలు.. వీటిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఉదయం అల్పాహారంలో భాగంగా చేసే ఈ పొట్టిక్కలు చూడడానికి ఇడ్లీ వలే ఉన్నప్పటికి వీటి తయారీ ప్రత్యేకంగా ఉంటుంది. పసు ఆకుల్లో వేసి ఈ పొట్టిక్కలను తయారు చేస్తారు. వీటిని తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే కోనసీమ పొట్టికలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కోనసీమ పొట్టిక్కలు తయారీకి కావల్సిన పదార్థాలు..
పొట్టు మినపప్పు – ఒక కప్పు, మెంతులు – అర టీ స్పూన్, ఇడ్లీ రవ్వ – 2 కప్పులు, పనసాకులు – 4, ఉప్పు – తగినంత.
కోనసీమ పొట్టిక్కలు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మినపప్పును, మెంతులను తీసుకోవాలి. తరువాత వాటిని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 5 గంటల పాటు నానబెట్టాలి. తరువాత మరో ఇడ్లీ రవ్వను తీసుకుని దీనిని కూడా శుభ్రంగా కడగాలి. ఇడ్లీ రవ్వలో కూడా తగినన్ని నీళ్లు పోసి 5 గంటల పాటు నానబెట్టాలి. నానిన తరువాత మినపప్పును శుభ్రంగా కడిగి జార్ లోకి తీసుకోవాలి. ఈ మినపప్పులో తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఇడ్లీ పిండిలా మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఇడ్లీ రవ్వలోని నీటిని పిండుతూ వేసుకోవాలి. తరువాత వీటిని అంతా కలిసేలా బాగా కలపాలి. ఈ పిండి 6 నుండి 8 గంటల పాటు లేదా రాత్రంతా నానబెట్టాలి. తరువాత దీనిలో తగినంత ఉప్పును వేసి కలపాలి. ఇప్పుడు పనస చెట్టు ఆకులను తీసుకుని శుభ్రంగా కడగాలి. ఇప్పుడు నాలుగు ఆకులను తీసుకుని చీపురు పుల్లల సహాయంతో బుట్టలాగా చేసుకోవాలి.
ఇలా అన్నింటిని చేసుకున్నతరువాత వాటిలో నిండా పిండి వేయకుండా కొద్దిగా తగ్గించి వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ లో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక అందులో రెండు ఇడ్లీ ప్లేట్లను ఉంచాలి. ఈ ప్లేట్ల మీద మనం ముందుగా తయారు చేసుకున్న పిండి బుట్టలను ఒకదాని పక్కకు ఒకటి తగినన్ని ఉంచాలి. తరువాత మూత పెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని బయటకు తీసి స్వర్ చేసుకోవాలి. ఈ పొట్టిక్కలను దబ్బకాయ పచ్చడితో లేదా అల్లం చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. పనసాకుల్లో వండడం వల్ల ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు కూడా దీనిలో కలుస్తాయి. అలాగే వీటి రుచి కూడా మరింత పెరుగుతుంది. ఈ పొట్టిక్కలను తరచూ కాకపోయినా అప్పుడప్పుడూ చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు.