Stomach Pain : ప్రస్తుత తరుణంలో చాలా మంది అనేక రకాల జీర్ణ సమస్యలతో సతమతం అవుతున్నారు. వాటిల్లో ముఖ్యంగా కడుపు నొప్పి కూడా ఒకటి. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. తిన్న ఆహారం జీర్ణం కాకపోయినా.. అధికంగా ఆహారం తీసుకున్నా.. ఎక్కువ మసాలాలు, కారం ఉన్న ఆహారాలను తీసుకున్నా లేదా.. మాంసాహారం ఎక్కువగా తిన్నా.. మనకు అప్పుడప్పుడు కడుపులో నొప్పి వస్తుంటుంది. దీంతో విలవిలలాడిపోతాం. అయితే సాధారణంగా వచ్చే కడుపు నొప్పికి ఇంగ్లిష్ మెడిసిన్ అవసరం లేదు. మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే సమస్యను తగ్గించుకోవచ్చు. అందుకు ఏమేం చిట్కాలు ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనం చేయడానికి 30 నిమిషాల ముందు చిన్న దాల్చిన చెక్క తినాలి. అనంతరం ఒక గ్లాస్ మజ్జిగ తాగాలి. ఇలా రోజుకు 3 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది. దీంతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే అజీర్తి, గ్యాస్, అసిడిటీ కూడా తగ్గుతాయి. ఇక ఈ సమస్యల నుంచి బయట పడేందుకు పుదీనా రసం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకు గాను భోజనానికి ముందు 4 టీస్పూన్ల పుదీనా రసాన్ని తీసుకోవాలి. 30 నిమిషాల ముందు ఇలా చేయాలి. దీన్ని రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. దీంతో సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
అల్లం, తేనెలను సమాన భాగాలుగా తీసుకుని భోజనానికి 15 నిమిషాల ముందు తినాలి. తేనెకు బదులుగా బెల్లం కూడా ఉపయోగించవచ్చు. ఇలా రోజుకు 3 సార్లు చేయాలి. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్ సమస్య తగ్గుతుంది. కడుపు నొప్పి నుంచి బయట పడవచ్చు. ఇలా పలు చిట్కాలను పాటించడం వల్ల కేవలం కడుపు నొప్పి మాత్రమే కాదు.. ఇతర జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. పొట్టంతా శుభ్రమవుతుంది.