Tingling : మనకు సహజంగానే అప్పుడప్పుడు కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వస్తుంటాయి. ఒకే చోట ఎక్కువ సేపు కదలకుండా కూర్చున్నా.. పడుకున్నా.. నిలుచున్నా.. తిమ్మిర్లు అనేవి వస్తుంటాయి. ఆయా భాగాల్లో రక్త సరఫరా సరిగ్గా జరగక తిమ్మిర్లు ఏర్పడుతాయి. అయితే శరీరాన్ని అటు ఇటు కదిలిస్తుంటే ఈ తిమ్మిర్లు అనేవి పోతాయి. కానీ రోజూ తిమ్మిర్లు వస్తుంటే.. అప్పుడు అప్రమత్తం అవ్వాలి. రోజూ నిరంతరాయంగా తిమ్మిర్లు వస్తున్నాయంటే.. శరీరంలో ఏదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి.
డయాబెటిస్ ఉన్నవారికి, విటమిన్ బి12 లోపం ఉన్నవారిలో, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో, కిడ్నీ వ్యాధులు, అధిక బరువు, కండరాలపై ఒత్తిడి అధికంగా పడడం, గర్భిణీలు, కాల్షియం లోపం.. వంటి కారణాల వల్ల కొందరికి తరచూ తిమ్మిర్లు వస్తుంటాయి. ఇక నీటిని సరిగ్గా తాగకపోయినా కూడా ఇలా జరుగుతుంది. కనుక తిమ్మిర్లు అసలు ఎందుకు వస్తున్నాయో ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకు గాను డాక్టర్‌ను కలిసి ముందుగా పరీక్షలు చేయించుకుని నిర్దారించుకోవాలి. అందుకు తగిన విధంగా తిమ్మిర్లు ఎందుకు వస్తున్నాయో తెలుసుకుని చికిత్స తీసుకోవాలి.
ఇక తిమ్మిర్ల సమస్య ఉన్నవారు విటమిన్ బి12 ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. పోషకాహార లోపం వల్ల వచ్చిన సమస్య అయితే ఈ విటమిన్ ను తీసుకుంటే చాలు, సమస్య తగ్గుతుంది. విటమిన్ బి12 ఎక్కువగా మనకు మాంసాహార పదార్థాల్లో లభిస్తుంది. పాలు, గుడ్లు, చేపలు, చికెన్, మటన్ లివర్, రొయ్యలు వంటి ఆహారాలను తీసుకోవడం ద్వారా విటమిన్ బి12ను పొందవచ్చు. దీంతోపాటు పుట్టగొడుగులు, చీజ్, ఓట్స్‌లోనూ మనకు విటమిన్ బి12 లభిస్తుంది. ఈ ఆహారాలను తీసుకోవడం ద్వారా విటమిన్ బి12 లభించి పోషకాహార లోపం పోతుంది. దీంతో తిమ్మిర్లు తగ్గుతాయి.
అలాగే డయాబెటిస్ ఉన్నవారు షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలి. థైరాయిడ్ సమస్య ఉన్నవారు థైరాయిడ్ గ్రంథుల పనితీరు ఎలా ఉందో చెక్ చేయించుకోవాలి. ఇలా అన్ని విధాలుగా పరీక్షలు చేయించుకుంటే అసలు సమస్య ఏమిటన్నది అర్థం అవుతుంది.
తిమ్మిర్లు బాగా వచ్చే వారు పలు చిట్కాలను పాటించడం వల్ల కూడా వాటి నుంచి బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలంటే..
1. ఆలివ్ ఆయిల్‌తో రాత్రి పూట చేతులు, కాళ్లను బాగా మర్దనా చేయడం వల్ల తిమ్మిర్ల నుంచి బయట పడవచ్చు. దీంతో శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది.
2. రాత్రి నిద్రకు ముందు ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, ఒక టీస్పూన్ తేనె కలిపి తాగాలి. దీని వల్ల కూడా తిమ్మిర్లు తగ్గుతాయి.
3. స్నానం చేసే నీటిలో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వేసి బాగా కలిపి ఆ నీటితో స్నానం చేయాలి. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో తిమ్మిర్లు తగ్గుతాయి.
4. ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో కొద్దిగా దాల్చిన చెక్క పొడిని కలిపి రాత్రి నిద్రకు ముందు తాగాలి. సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
5. రోజూ మధ్యాహ్నం లేదా రాత్రి ఒక కప్పు పెరుగును తినాలి. స్వచ్ఛమైన వెన్న తీయని పాల నుంచి తయారు చేసిన పెరుగు అయితే మంచిది. దీంతో అందులో మాంగనీస్ ఎక్కువగా లభిస్తుంది. ఇది తిమ్మిర్లు రాకుండా చూస్తుంది.