Uttareni : చేలల్లో, పొలాల గట్ల మీద, ఖాళీ ప్రదేశాల్లో ఎక్కువగా పెరిగే మొక్కలల్లో ఉత్తరేణి మొక్క కూడా ఒకటి. గ్రామాలల్లో ఉన్న వారికి ఈ మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఈ మొక్కను మనలో చాలా మంది చూసే ఉంటారు. ఈ భూమి మీద పెరిగే అద్భుతమైన మొక్కలల్లో ఇది ఒకటి. చాలా మంది ఈ ఉత్తరేణి మొక్కను కలుపు మొక్కగా భావిస్తూ ఉంటారు. కానీ దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వాత, కఫ, పిత వ్యాధులను నయం చేయడంలో ఈ మొక్క ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఈ మొక్కను ఉపయోగించి ఆయుర్వేదంలో అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేస్తూ ఉంటారు. ఉత్తరేణి మొక్కలో ఉండే ఔషధ గుణాల గురించి అలాగే దాని వల్ల మనం ఏయే ఏయే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తరేణి మొక్కను సంస్కృతంలో అపామార్గ, మయూరక అని, హిందీలో చర్ చటా, ఊంగా, లట్ జీర అని పిలుస్తారు. అలాగే దీనిని తెలుగులో దుచ్చెన, కుక్కచీరే ఆకు అని కూడా పిలుస్తారు. ఉత్తరేణి మొక్కలో ప్రతి భాగం కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడంలో ఉత్తరేణి మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పచ్చి ఉత్తరేణి గింజలను 20 గ్రాముల మోతాదులో తీసుకుని నీటితో నూరి వడకట్టాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయం పరగడుపున తాగుతూ ఉంటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన వివిధ రకాల సమస్యలను తగ్గించే గుణం కూడా ఉత్తరేణికి ఉంది. ఉత్తరేణి మొక్క సమూలంగా తీసుకువచ్చి కాల్చి బూడిద చేయాలి. ఈ బూడిదకు రెండు రెట్లు పంచదారను కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పూటకు మూడు గ్రాముల మోతాదులో రెండు పూటలా తీసుకోవాలి.
ఇలా తీసుకోవడం వల్ల దగ్గు, ఆయాసం, కఫం వంటి సమస్యలు తగ్గు ముఖం పడతాయి. అదే విధంగా ఉత్తరేణి ఆకులు, వెల్లుల్లిపాయలు, మిరియాలు సమానంగా కలిపి మెత్తగా నూరి శనగగింజ పరిమాణంలో మాత్రలుగా చేసుకోవాలి. వీటిని గాలికి ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మాత్రలను పూటకు రెండు చొప్పున వేడి నీటితో తీసుకోవడం వల్ల జ్వరాలు తగ్గు ముఖం పడతాయి. అలాగే రక్తమొలలతో బాధపడే వారికి ఈ మొక్క ఎంతో సహాయపడుతుంది. ఎర్ర ఉత్తరేణి ఆకుల రసం 50 గ్రా. ఆవు నెయ్యి 50 గ్రాముల మోతాదులో కలిపి తాగుతూ ఉంటే మొలల నుండి రక్తం కారడం ఆగడంతో పాటు మొలలకు హరించుకుపోతాయి. పిప్పి పన్ను సమస్యను తగ్గించడంలో ఉత్తరేణి మొక్క అద్భుతంగా పని చేస్తుంది. ఉత్తరేణి మొక్క గింజలను దంచి జల్లించి నిల్వ చేసుకోవాలి. 100 గ్రాముల పొడికి 10 గ్రాముల ఉప్పు పొడి కలిపి నిల్వ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న పొడితో దంతాలను శుభ్రం చేసుకుంటే దంత సమస్యలన్నీ తగ్గుతాయి. దంతాలు తెల్లబడడంతో పాటు పిప్పి పన్ను సమస్య కూడా తగ్గుతుంది. స్త్రీలల్లో వచ్చే గర్భాశయ సమస్యలను తగ్గించే గుణం కూడా ఉత్తరేణికి ఉంది. ఉత్తరేణి మొక్క ఆకులను, వేర్లను సమానంగా దంచి పొడిగా చేసుకోవాలి. ఈ పొడికి సమానంగా పటిక బెల్లం పొడిని కలిని నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని ఆహారానికి గంట ముందు మూడు వేళ్లతో వచ్చినంత తీసుకోవాలి. ఇలా రెండు పూటలా తీసుకోవడం వల్ల గర్భాశయం శుద్ధి అవ్వడంతో పాటు నెలసరి కూడా సక్రమంగా వస్తుంది. అలాగే బోదకాలు, బోద జ్వరాలను హరించే గుణం కూడా ఉత్తరేణికి ఉంది. ఉత్తరేణి వేర్లు, నేలతాడి దుంపలు, పిప్పళ్లు సమానంగా తీసుకుని వాటికి సమానంగా పాతబెల్లాన్ని కలిపి దంచి నిల్వ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని పూటకు 10 గ్రాముల మోతాదులో రెండు పూటలా తీసుకుంటూ ఉంటే బోదకాళ్లు, బోద జ్వరాలు తగ్గిపోతాయి. ఈ ఉత్తరేణి మొక్క కుక్కకాటు విరుగుడుగా కూడా పని చేస్తుంది. ఉత్తరేణి వేర్లను నీటితో కలిపి మెత్తగా నూరాలి. తరువాత వస్త్రంలో వేసి వడకట్టాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని 3 గ్రాముల మోతాదులో తీసుకుని దానికి 20 గ్రాముల తేనెను కలిపి రెండు పూటలా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కుక్కకాటు విషం హరించుకుపోతుంది. ఈ విధంగా ఉత్తరేణి మొక్క మనకు ఎంతో సహాయపడుతుందని దీనిని వాడడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.