Methi Aloo Fry : మనం తరుచు బంగాళాదుంపలతో ఫ్రైను తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఈ ఫ్రైను మనలో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ఈ బంగాళాదుంప ఫ్రైను మనం మరింత రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా తయారు చేసుకోవచ్చు. బంగాళాదుంపలతో మెంతికూరను కలిపి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఈ ఫ్రై చేదు లేకుండా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే మేథీ ఆలూ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మేథీ ఆలూ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
మెంతికూర – రెండు కట్టలు, ఉడికించిన బంగాళాదుంపలు -4, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ.
మేథీ ఆలూ ఫ్రై తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత మెంతికూర వేసి వేయించాలి. మెంతికూర చక్కగా వేగి దగ్గర పడిన తరువాత పసుపు, ఉప్పు, కారం వేసి కలపాలి. తరువాత బంగాళాదుంపలను ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకుని మూత పెట్టి 3 నిమిషాల పాటు మగ్గించాలి. ఇలా మగ్గించిన తరువాత మరోసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మేథీ ఆలూ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా, నాన్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే ఆలూ ఫ్రై కంటే ఈ విధంగా మెంతికూర వేసి వేసే ఆలూ ఫ్రై మరింత రుచిగా ఉంటుంది. ఈ ఆలూ ఫ్రైను తినడం వల్ల రుచితో పాటు మనం ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.