Lice : తలలో పేల సమస్యతో బాధపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఇవి అందరినీ వేధిస్తూ ఉంటాయి. పేలు బాహ్య పరాన్న జీవుల జాతికి చెందినవి. ఇవి జుట్టులో ఉండి మన రక్తాన్ని ఆహారంగా తీసుకుంటూ జీవిస్తాయి. పేలే కదా అని నిర్లక్ష్యం చేస్తే వీటి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. వీటి కారణంగా తలలో దురదలతోపాటు మనకు చికాకు, కోపం కూడా ఎక్కువగా వస్తాయి. తలలో పేలను నివారించడానికి మనకు మార్కెట్ లో పేల మందు కూడా దొరుకుతుంది. కానీ దీనిని ఉపయోగించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలతోపాటు తలలో దురదలు ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంటుంది.
ఇంటి చిట్కాను ఉపయోగించి మనం సహజసిద్ధంగా ఈ పేల సమస్య నుండి బయటపడవచ్చు. తలలో పేల సమస్యతో బాధపడే వారు ముందుగా ఒక గిన్నెలో పావు కప్పు నీళ్లను తీసుకోవాలి. తరువాత ఈ నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పును వేసి ఉప్పు కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. తరువాత ఒక గిన్నెలో పావు కప్పు వెనిగర్ ను తీసుకుని గోరు వెచ్చగా అయ్యే వరకు వేడి చేయాలి. ఇలా వేడి చేసిన వెనిగర్ ను ముందుగా ఉప్పు వేసి కలిపిన నీటిలో వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్ లో పోసి జుట్టు కుదుళ్లపై బాగా స్ప్రే చేయాలి. బాటిల్ అందుబాటులో లేని వారు ఈ మిశ్రమంలో దూదిని ముంచి ఆ దూదితో జుట్టు కుదుళ్లపై రాయాలి.
ఈ మిశ్రమాన్ని రాసిన తరువాత కొబ్బరి నూనెను కానీ ఆలివ్ ఆయిల్ కానీ మరలా జుట్టుకు పట్టేలా బాగా రాయాలి. తరువాత జుట్టును దగ్గరగా ముడి వేసి 2 గంటల పాటు అలాగే ఉంచాలి. 2 గంటల తరువాత పేల దువ్వెనను తీసుకుని జుట్టును దువ్వుకోవాలి. ఇలా దువ్వడం వల్ల చనిపోయిన పేలు తొలగిపోతాయి. ఇలా దువ్విన తరువాత రసాయనాలు తక్కువగా ఉన్న షాంపూతో లేదా హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ చిట్కాను వారానికి రెండుసార్లు పాటించడం వల్ల తలలో ఉండే పేలు పూర్తిగా నివారించబడతాయి. ఈ చిట్కాను రెండు నుండి నాలుగు సార్లు వాడడం వల్ల మన తలలో ఉండే పేలు పూర్తిగా తొలగిపోతాయి. ఈ చిట్కా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.