Sleep : ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకోవాలంటే ఇలా చేయాలి..!

Sleep : నిద్ర‌లేమి.. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. శ‌రీరానికి త‌గినంత నిద్ర‌లేక‌పోవ‌డం వల్ల ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా తలెత్తుతాయి. మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న‌, మారిన జీవ‌న విధానం, అధికంగా టీ, కాఫీలు తాగ‌డం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల నిద్ర‌లేమి స‌మ‌స్య త‌లెత్తుతుంది. అలాగే ప‌డుకునే ముందు సెల్ ఫోన్ ల‌ను చూడ‌డం, శ‌రీరంలో ఉండే ఇత‌ర‌త్రా శారీరక బాధ‌లు కూడా నిద్ర‌ప‌ట్ట‌కుండా చేస్తాయి. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి చాలా మంది నిద్ర మాత్ర‌ల‌ను ఉప‌యోగిస్తూ ఉంటారు. అలాగే అనేక ర‌కాల చిట్కాల‌ను పాటిస్తారు.

అస‌లు ఈ చిట్కాల‌ను పాటించ‌డానికి ముందు నిద్ర‌లేమి స‌మ‌స్య ఎందుకు త‌లెత్తుతుందో గ‌మ‌నించాలి. ముందు మ‌న అల‌వాట్ల‌ను, జీవ‌న శైలిని చూసుకుని వాటిని స‌రి చేసుకోవాలి. అవ‌స‌ర‌మైతే కాగ్నిటివ్ బిహేవియ‌ర‌ల్ థెర‌పీని వంటి వాటిని పాటించాలి. వీటితో ప్ర‌యోజ‌నం లేన‌ప్పుడు మాత్ర‌ల గురించి ఆలోచించాలి. నిద్ర‌లేమి స‌మ‌స్య‌కు ఎక్కువ‌గా ప‌రీక్ష‌లు కూడా ఏమీ అవ‌స‌రం ఉండ‌దు. నిద్ర‌లేమి స‌మ‌స్య‌కు కాగ్నిటివ్ బిహేవియ‌ర‌ల్ థెర‌పీ ద్వారా చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చ‌ని శాస్త్ర‌వేత్తలు గ్ర‌హించారు.

wonderful tips to get into sleep as soon as possible
Sleep

ఇందులో కొన్ని చిట్కాలను పాటించ‌డం వల్ల నిద్ర‌లేమి స‌మ‌స్య‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. రాత్రిళ్లు మ‌నం గ‌డియారం వైపు చూస్తూ కూర్చుంటే తెల్ల‌వార‌దు క‌దా. పైగా రాత్రంతా బాగా భారంగా గ‌డుస్తుంది. కాబ‌ట్టి మ‌నం గోడ గ‌డియారం వైపు దృష్టి పెట్ట‌క అంత‌రంగ గ‌డియారం వైపు చూపును ప్ర‌స‌రింప‌జేయాలి. మ‌న‌కు కావ‌ల్సిన నిద్ర‌ను కావ‌ల్సిన మెలుకువ‌ను నిర్ణ‌యించేది ఈ అంత‌రంగ గ‌డియార‌మే. ఏ వ‌య‌సులోనైనా మ‌న‌ల్ని న‌డిపించేది ఈ అంత‌రంగ గ‌డియార‌మే.

నిద్ర‌పోయేట‌ప్పుడు గ‌డియారం క‌న‌బ‌డ‌కుండా చూసుకోవాలి. గ‌డియారం చూడ‌డం వ‌ల్ల మ‌న‌కు మ‌రింత ఆందోళ‌న పెరుగుతుంది. పూర్వం మ‌న‌కు లైట్లు లేవు. చీక‌టి ప‌గ‌డానే అంద‌రూ చ‌క్క‌గా నిద్ర‌కు ఉప‌క్ర‌మించే వారు. కానీ ఇప్పుడు నిద్ర‌పోయే ముందు కూడా టీవీల‌ను, సెల్ ఫోన్ లు ఎక్కువ‌గా చూస్తున్నాం. సెల్ ఫోన్ ల నుండి వ‌చ్చే బ్లూ లైట్ మ‌న‌కు నిద్ర ప‌ట్టకుండా చేస్తుంది. ఇది నిద్ర‌ను ప్రేరేపించే మెలటోనిన్ ఉత్ప‌త్తిని అడ్డుకుంటుంది. దీంతో మ‌న‌కు నిద్ర ప‌ట్ట‌దు.

అలాగే చాలా మంది ప్ర‌స్తుత కాలంలో రాత్రి భోజ‌నాన్ని ఆల‌స్యంగా చేస్తున్నారు. ఆల‌స్యంగా తిన‌డం వ‌ల్ల క‌డుపులో ఆమ్లాల ఉత్ప‌త్తి పెరిగి నిద్ర ప‌ట్ట‌డం క‌ష్టం అవుతుంది. నిద్ర‌పోవ‌డానికి రెండు మూడు గంట‌ల మందే భోజ‌నం చేయాలి. ఆక‌లి అనిపిస్తే ప‌డుకునే ముందు ఏదైనా తేలిక‌గా జీర్ణ‌మ‌య్యే ఆహారాల‌ను తీసుకోవాలి. నిద్ర పోవ‌డానికి రెండు గంట‌ల ముందు స్వీట్స్, కూల్ డ్రింక్స్ వంటి వాటిని తీసుకోకూడ‌దు. అలాగే గ‌దిలో వెలుతురు లేకుండా చూసుకోవాలి. వెలుతురు ఉండ‌డం వ‌ల్ల కూడా కొన్ని సార్లు నిద్ర ప‌ట్ట‌దు.

మ‌ద్యం, కాఫీ, టీ వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. టీ, కాఫీల‌ను కూడా మోతాదుకు మించి తాగ‌కూడ‌దు. వ్యాయామం నిద్ర‌ను పెంపొందిస్తుంది. కానీ నిద్ర‌పోవ‌డానికి రెండు గంట‌ల ముందు మాత్రం వ్యాయామం చేయ‌కూడ‌దు. నిద్ర‌పోవ‌డానికి ముందే కాల‌కృత్యాల‌ను తీర్చుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల నిద్ర‌కు ఆటంకం క‌ల‌గ‌కుండా ఉంటుంది.

నిద్ర‌పోవ‌డానికి అర‌గంట ముందే మంచం మీద‌కు చేరాలి. ఆహ్లాద‌క‌ర‌మైన సంగీతాన్ని వినాలి. పుస్త‌కాల‌ను చ‌ద‌వ‌డం అల‌వాటు చేసుకోవాలి. అదే విధంగా నిద్ర‌పోవ‌డానికి ముందు చ‌క్క‌గా స్నానం చేయాలి. అర‌టి పండ్ల‌ను తిన‌డం, పాల‌ను తాగ‌డం వంటివి చేయాలి. ఈ చిట్కాల‌న్నింటినీ పాటించిన త‌రువాత కూడా నిద్ర‌ప‌ట్ట‌క‌పోతే అప్పుడు వైద్యున్ని సంప్ర‌దించాలి.

D

Recent Posts