పట్టుచీరలను మృదుజలంతో ఉతకాలి. కఠిన జలమైతే నీటిని మృదువు చేయడానికి చిటికెడు బోరాక్స్ లేదా అమోనియంను వాడాలి. నాణ్యమైన తటస్థ సబ్బులు పొడి రూపంలోకాని ద్రవరూపంలో కాని ఉపయోగించాలి. కఠిన జలమైతే లైట్ డిటర్జెంట్లను వినియోగించాలి. సబ్బులోని మట్టిని తొలగించడానికి పట్టు వస్త్రాలను వేడి నీటిలో రెండు మూడు సార్లు జాడించాలి. చివరగా చల్లని నీటితో జాడించేటప్పుడు కొన్ని చుక్కల సిట్రిక్ యాసిడ్ లేదా ఎసిటిక్ యాసిడ్‌ను ఉపయోగించాలి. అనుమానపు రంగు కల పట్టు వస్త్రాలు ఉతికే ముందు 1 నుంచి 2 నిముషాలు చిటికెడు సిట్రిక్ యాసిడ్ లేదా ఎసిటిక్ యాసిడ్ కలిపిన చల్లని నీటితో తడపాలి.
పట్టు వస్త్రాలు ఉతికిన తరువాత చేతితో సున్నితంగా పిండి తడిని తీయాలి. పట్టు చీరలను గదిలో నీడ పట్టున వేలాడ దీసి ఆరబెట్టాలి. రక్తం మరకలను తొలగించేందుకు వేడి నీటిలో జాడించి, కొన్ని చుక్కల అమోనియాను 10 సి.సి.ల హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో కలిపి మరకల మీద పూసి ఉతకాలి. పెరుగు లేదా వెన్న మరకలు అయితే ఒక చుక్క కార్బన్ టెట్రాక్లోరైడ్‌ని ఉపయోగించాలి. చాకొలెట్ మరకలు అయితే వేడి నీటిలో జాడించి ఉతకాలి. కాఫీ లేదా టీ మరకలు అయితే వస్త్రాలను ఆరనివ్వాలి. కార్బన్ టెట్రాక్లోరైడ్ ను పూసి మరకపోనట్లయితే కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను కలిపిన వేడి నీటిలో ఉతకాలి. కాస్మెటిక్ మరకలు అయితే బార్ సబ్బుతో రుద్ది జాడించి ఉతకాలి.
ఇంక్ లేదా లిప్‌స్టిక్ మరకైన చోట పేపర్ టవల్‌ను ఉంచి వెనుక భాగాన డ్రైక్లీనింగ్ ద్రావణం లేదా ఆల్కహాల్‌ను పూయాలి. మరక తొలిగే వరకు నీటిని ఉపయోగించరాదు. గోళ్ళ రంగు మరకలు పట్టు చీరలకు అంటితే అసిటోన్‌ను వాడాలి. క్రీం ( ఐస్ – పాలు ) మరకలు అయితే కార్బన్ టెట్రా క్లోరైడ్ పూసి వేడినీటిలో ఉతకాలి. గుడ్డు మరకలు అయితే చల్లని నీటితో తుడవాలి. పళ్ళరసాలు అయితే ఆల్కలీ, ఆల్కహాలును సమభాగాల్లో తీసుకొని తుడిచి ఉతకాలి. గ్రీజు మరకలు అయితే టాల్కం పౌడరును మరక మీద వేసి దాన్ని మరక కిందిభాగాన అంటేలా పేపరు టవలు మీద ఉంచి డ్రైక్లీనింగ్ ద్రావణంతో తుడవాలి. జాడించి ఉతికి ఇస్త్రీ చేయాలి.
యంత్రం నూనె మరకలను పీల్చేగుణమున్న పేపరుతో కప్పి రుద్దాలి. కార్బన్ టెట్రాక్లోరైడ్‌ను ఉపయోగించి మరకలను తొలగించాలి. మట్టి మరకలు అయితే వస్త్రాలను ఆరనిచ్చి కార్బన్ టెట్రాక్లోరైడ్ తో తుడిచి ఉతకాలి. రంగుల మరకలు అయితే వేడినీటితో జాడించి ఉతకాలి. మరక పోవాలంటే టర్పెంటైన్, కిరోసిన్ తో తుడిచి జాడించి ఉతకాలి. వార్నిష్ నూనె మరకలు అయితే కార్బన్ టెట్రాక్లోరైడ్ తో తుడవాలి. చెమట మరకలు అయితే తక్కువ ఘాడత కల హైడ్రాక్లోరిక్ ఆమ్లంలో జాడించి ఉతకాలి. బూట్ పాలిష్ మరకలు అయితే ఎక్కువ గల పాలిష్‌ను తొలగించాలి. ద్రావణ డిటర్జెంట్ తో రుద్ది తర్వాత ఆల్కహాల్ పూయాలి. వైన్ లేదా శీతల పానీయాల మరకలు అయితే చల్లని నీటిలో జాడించి ద్రావణ డిటర్జెంట్ ను ఉపయోగించి వేడినీటితో ఉతకాలి.