చికెన్ అంటే ఇష్టంగా తినని నాన్‌వెజ్ ప్రియులు ఉంటారా..? అసలే ఉండరు..! చికెన్ ఫ్రై, కర్రీ, మంచూరియా, 65, డ్రమ్ స్టిక్స్, టిక్కా… ఇలా చెప్పుకుంటూ పోతే చికెన్‌ను ఎన్నో రకాలుగా వండుకుని తినవచ్చు. ఒక్కో రకం ఒక్కో టేస్ట్‌ను ఇస్తుంది. అయితే ఏ చికెన్ వెరైటీని వండినా ముందుగా మనకు చికెన్‌ను బాగా కడిగి వంటకు ప్రిపేర్ చేయడం అలవాటు. కానీ మీకు తెలుసా..? నిజానికి చికెన్‌ను అస్సలు కడగకుండానే వండుకోవడం మంచిదట. అవును, మీరు విన్నది నిజమే. మరి కడగకపోతే అందులో ఉండే బాక్టీరియా, క్రిములు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి కదా..? అని అంటారా..! అయితే మీ ప్రశ్నకు సమాధానమే ఈ కథనం…
పై చిత్రాన్ని గమనించారా..? అందులో చికెన్‌ను నల్లా కింద కడుగుతున్నట్టుగా ఉంది కదా..! అవును, అదే. దాన్ని గ్రాఫిక్స్‌లో క్రియేట్ చేశారు. చికెన్ పై భాగంలో, చుట్టూ ఉన్న ఆకుపచ్చని పదార్థం ఏంటో తెలుసా..? అదే బాక్టీరియా, సూక్ష్మ క్రిములు. చికెన్‌ను నల్లా కింద కడుగుతున్నప్పుడు ఆ బాక్టీరియా అంతా చుట్టు పక్కలకు వ్యాప్తి చెందడాన్ని గమనించవచ్చు. మన కిచెన్‌లో చికెన్‌ను కడిగినా దాన్నుంచి బాక్టీరియా అలాగే పడుతుందట. పైన ఇచ్చిన బొమ్మ కేవలం గ్రాఫిక్స్‌లో క్రియేట్ చేసింది అయినా మనం చికెన్‌ను కడుగుతున్నప్పుడు నిజంగా అలాగే బాక్టీరియా చుట్టు పక్కల పడుతుందట. అందుకే మరి చికెన్‌ను కడగవద్దని, అలాగే వండుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు.
అయితే మరి మార్కెట్ నుంచి తెచ్చిన చికెన్‌లో ఎన్నో క్రిములు ఉంటాయి కదా..! మరి కడగకపోతే ఎలా..? అంటే ఏం లేదండీ… సింపుల్..! శుభ్రమైన డిస్పోజబుల్ పేపర్ తెచ్చి దాంతో చికెన్‌ను తుడుచుకోవచ్చు. అలా చేస్తే బాక్టీరియా వ్యాప్తి చెందదు. దీంతో చికెన్‌ను శుభ్రం చేసుకుని తింటున్నామన్న భావన కూడా కలుగుతుంది. అయితే ఇలా కూడా మీరు సంతృప్తి చెందకపోతే చికెన్‌ను అలాగే కడగండి. కానీ దాన్ని కడిగాక మాత్రం ఆ చుట్టు పక్కల ఉన్న పరిసరాలను, పాత్రలను, ఇతర వస్తువులను కూడా శుభ్రం చేయాల్సి ఉంటుంది. లేదంటే ప్రమాదకరమైన సాల్మొనెల్లా, ఈ-కోలి వంటి బాక్టీరియా వాటిపై పేరుకుపోతుంది. అనంతరం ఎలాగోలా అది మన శరీరంలోకి చేరుతుంది. అప్పుడు కలిగే అనారోగ్యాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే కదా. ఈ బాధ లేకుండా ఉండాలంటే చికెన్‌ను కడగకుండానే తినడం బెటరేమో కదా..!
పైన మేం చెప్పిన విషయం కల్పితమైంది కాదు. డ్రెక్సెల్ యూనివర్సిటీకి చెందిన జెన్నిఫర్ క్విన్లాన్ అనే మహిళా సైంటిస్టు చేసిన పరిశోధనకు చెందిన విషయమే అది. కనుక చికెన్‌ను వండేముందు దాన్ని కడగాలో వద్దో ఇకపై మీరే నిర్ణయించుకోండి..!